తెలంగాణ

telangana

యుద్ధం తర్వాత గాజాను పాలించేదెవరు? కాల్పుల విరమణకు నెతన్యాహూ నో

By PTI

Published : Nov 12, 2023, 7:17 AM IST

Updated : Nov 12, 2023, 7:38 AM IST

Israel Gaza War Netanyahu : హమాస్‌-ఇజ్రాయెల్‌ యుద్ధాన్ని విరమింపజేసేందుకు అమెరికా సహా పశ్చిమ దేశాలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకవేళ ఇజ్రాయెల్‌ యుద్ధాన్ని విరమిస్తే గాజాను మళ్లీ హమాస్ మిలిటెంట్లే పాలిస్తారా.... లేక గతంలో అధికారంలో ఉన్న పాలస్తీనియన్‌ అథారిటీకి మళ్లీ పగ్గాలు అప్పగిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే గాజాను మళ్లీ ఆక్రమించుకోవాలన్న ఆలోచన తమకు లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఓ అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు.

Israel Gaza War Netanyahu
Israel Gaza War Netanyahu

Israel Gaza War Netanyahu : ఇన్నాళ్లు హమాస్‌ గుప్పిట్లో ఉన్న గాజా... యుద్ధం తర్వాత ఎవరి చేతుల్లోకి వెళుతుందన్నది ఆసక్తికరంగా మారింది. 2005లో గాజా నుంచి తన సైన్యాన్ని ఉపసంహరించుకున్న ఇజ్రాయెల్‌.. 2007లో ఆ ప్రాంతానికి బయటి నుంచి రవాణాను నిషేధిస్తూ పూర్తిగా దిగ్బంధించింది. అదే అదునుగా భావించిన హమాస్‌ ఉగ్రసంస్థ.. అప్పటికి అక్కడ అధికారంలో ఉన్న పాలస్తీనియన్‌ అథారిటీ పై దాడులు చేసి ప్రభుత్వాన్ని దించేసింది. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అప్పటి నుంచి గాజా పట్టీలోని దాదాపు 24 లక్షల మంది ప్రజలను పాలిస్తూ వస్తోంది.

తాజా పరిస్థితుల్లో మళ్లీ పాలస్తీనియన్‌ అథారిటీకి పగ్గాలు అందుతాయా అనే వాదన తెరమీదకి వచ్చింది. అమెరికా విదేశాంగశాఖ మంత్రి అంటోని బ్లింకెన్‌ వ్యాఖ్యలు దీనికి మరింత బలం చేకూరుస్తున్నాయి. ఒకవేళ పాలస్తీనియన్‌ అథారిటీకి అధికారంలోకి రావాలనుకుంటే దానికి అంతర్జాతీయ శక్తులు మరింత తోడ్పాటు అందిస్తాయంటూ.. పరోక్షంగా మద్దతు పలికారు. దశాబ్దాల కాలంగా ఇజ్రాయెల్‌-పాలస్తీనా వివాదానికి సమగ్ర రాజకీయ పరిష్కారం దొరికినప్పుడే పీఏ అధికారాన్ని చేపట్టగలదని బ్లింకెన్‌తో జరిగిన సమావేశంలో పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్‌ అబ్బాస్ వ్యాఖ్యానించారు.

ఇజ్రాయెల్ బలగాలే నియంత్రిస్తాయి
గాజాను మళ్లీ ఆక్రమించుకోవాలన్న ఆలోచన తమకు లేదని ఇజ్రాయెల్ ప్రధాని ఓ అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు. అక్కడ భద్రతను ఇజ్రాయెల్ దళాలే నియంత్రిస్తాయని చెప్పారు. ఆ ప్రాంతం అభివృద్ధి చెందేలా కృషి చేసేందుకు ఓ ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అయితే, ఆ ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. అంతర్జాతీయంగా కాల్పులను విరమించాలని వస్తున్న పిలుపును నెతన్యాహూ తిరస్కరించారు. గాజాలో బందీలుగా ఉన్న 239 మందిని విడుదల చేస్తేనే కాల్పుల విరమణ సాధ్యమవుతుందని తెలిపారు.

ఆధునాతన ఆయుధాలతో ఇజ్రాయెల్​పై దాడి
మరోవైపు ఇజ్రాయెల్‌పై అధునాతన ఆయుధాలతో దాడులు చేయనున్నట్లు లెబనాన్‌లోని హెజ్బొల్లా గ్రూప్‌ చీఫ్‌ హసన్‌ నస్రల్లా వెల్లడించారు. పాలస్తీనా మద్దతుదారులను ఉద్దేశించి హసన్ రెండోసారి మాట్లాడారు. "తొలిసారిగా బుర్కాన్‌ క్షిపణిని ఇజ్రాయెల్‌పై శనివారం ప్రయోగించాం. ఈ క్షిపణి 300 నుంచి 500 కేజీల పేలోడ్‌ను మోయగలదు. అంతేకాదు, దాడి చేయగల నిఘా డ్రోన్లను సైతం ఉపయోగిస్తున్నాం. పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయెల్‌పై దాడులుచేస్తాం. ఇరాన్‌ మద్దతుతో గత వారం రోజులుగా ఇజ్రాయెల్‌పై దాడులను ఉద్ధృతం చేసేందుకు అధునాతన ఆయుధాలతో దాడికి దిగబోతున్నాం. ఇజ్రాయెల్‌లో నిర్దేశించిన లక్ష్యాలపై దాడులు చేసేందుకు హెజ్బొల్లా మిలిటెంట్లు సిద్ధంగా ఉన్నారు." అని హసన్‌ తెలిపారు.

అతిపెద్ద ఆస్పత్రిని చుట్టుముట్టిన ఇజ్రాయెల్​ దళాలు- పసికందుల ప్రాణాలకు ముప్పు?

150 మంది ఉగ్రవాదులు హతం, హమాస్ స్థావరాలు ధ్వంసం- ఇజ్రాయెల్ గుప్పిట్లోకి గాజా!

Last Updated : Nov 12, 2023, 7:38 AM IST

ABOUT THE AUTHOR

...view details