Gaza Power Cut : హమాస్ మిలిటెంట్ల ఏరివేత లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ ముప్పేట దాడి కొనసాగిస్తోంది. హమాస్ ఉగ్రవాదులు కేంద్రంగా చేసుకున్న అనేక స్థావరాలపై ఇజ్రాయెల్ రక్షణ బలగాలు దాడులకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో గాజాలో ఉన్న ఒకే ఒక్క విద్యుత్ ఉత్పత్తి కేంద్రం తాజాగా మూతపడింది. ఇంధన నిల్వలు పూర్తిగా నిండుకుండటం వల్ల నిలిపివేస్తున్నట్లు సంస్థ పేర్కొంది. దీంతోపాటు ఇజ్రాయెల్ ఇంధన సరఫరా నిలిపివేయడం వల్ల జనరేటర్లు ఆధారంగా ఉన్న అనేక ఇళ్లు, ఆసుపత్రులతోపాటు గాజా మొత్తం అంధకారంలోకి వెళ్లనుంది!
ప్రకటించిన కొన్ని గంటల్లోనే..
Does Gaza Have Electricity : తమపై హమాస్ జరిపిన దాడికి ప్రతీకారంగా వారి స్థావరాలకు విద్యుత్తు నిలిపివేస్తామని ఇజ్రాయెల్ ఇటీవలే ప్రకటించింది. ఇందులో భాగంగా మిలిటెంట్లకు కేంద్రంగా నిలిచిన గాజాను అష్ట దిగ్బంధం చేసిన ఇజ్రాయెల్.. విద్యుత్తు, ఆహారం, ఔషధాలతోపాటు ఇంధన సరఫరాను నిలిపేసింది. దీంతోపాటు గాజా సరిహద్దులన్నింటినీ మూసివేయడం వల్ల.. విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి, ఇళ్లు, కార్యాలయాల్లో వాడే జనరేటర్లకు ఇంధనం తీసుకురావడం అసాధ్యంగా మారింది. ఇదే సమయంలో బుధవారం సాయంత్రం నాటికి ఇక్కడి ఉత్పత్తి కేంద్రం మూతపడే అవకాశం ఉందని అక్కడున్న ఒకే ఒక్క విద్యుత్ తయారీ సంస్థ హెచ్చరించింది. ఇలా ప్రకటించిన కొన్ని గంటల్లోనే దీన్ని మూసివేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
ఇజ్రాయెల్‌కు అమెరికా ప్రత్యేక ప్యాకేజీ
Us Israel News Today :హమాస్ మిలిటెంట్లను ఎదుర్కొవడంలో ఇజ్రాయెల్‌కు అమెరికా పూర్తిగా మద్దతుగా నిలుస్తోంది. ఇప్పటికే అమెరికా యుద్ధ నౌకలు ఆ ప్రాంతానికి చేరుకోగా.. తాజాగా అత్యాధునిక ఆయుధాలను ఇజ్రాయెల్‌కు అమెరికా అందించింది. అమెరికా పంపిన అత్యాధునిక ఆయుధాలు రవాణా విమానంలో ఇజ్రాయెల్‌కు చేరుకున్నాయి. ఈ దృశ్యాలను ఇజ్రాయెల్ రక్షణ శాఖ విడుదల చేసింది. ఇందులో కీలకమైన సైనిక సామగ్రి ఉన్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్ సంస్థ మెరుపుదాడిలో 14 మంది అమెరికన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. 20 మంది గల్లంతయ్యారు. బందీలుగా హమాస్ అపహరించిన వారిలో కూడా అమెరికన్లు ఉండవచ్చని భావిస్తున్నారు.