తెలంగాణ

telangana

ETV Bharat / international

గాజాపై మళ్లీ బాంబుల వర్షం-15 వేలు దాటిన మరణాలు- హమాస్ అంతానికి నెతన్యాహు కొత్త స్కెచ్! - ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంపై నెతన్యాహు

Israel Gaza Death Toll : ఇజ్రాయెల్‌ దాడులతో గాజా అతలాకుతలమవుతోంది. ఇజ్రాయెల్‌- హమాస్‌ల మధ్య కుదిరిన సంధి గడువు ముగిసిపోవడం వల్ల స్థానికంగా మళ్లీ బాంబుల మోత మొదలైంది. ఈ క్రమంలోనే యుద్ధం ప్రారంభం నుంచి ఇప్పటివరకు గాజాలో 15,200 మంది మృతి చెందినట్లు గాజా ఆరోగ్య విభాగం తెలిపింది.

israel gaza war death toll
israel gaza war death toll

By ETV Bharat Telugu Team

Published : Dec 2, 2023, 8:34 PM IST

Israel Gaza Death Toll :ఇజ్రాయెల్​ హమాస్​ల మధ్య కుదిరిన ఒప్పందం ముగియడం వల్ల గాజాపై మళ్లీ బాంబుల మోత మొదలైంది. శుక్రవారం తిరిగి దాడులు మొదలుపెట్టిన ఇజ్రాయెల్ హమాస్‌కు చెందిన 200 లక్ష్యాలపై విరుచుకుపడింది. ఈ దాడుల్లో 178 మంది పౌరులు మృతి చెందినట్లు గాజాలోని వైద్య మంత్రిత్వ శాఖ తెలిపింది. నివాసాలు, పెద్ద పెద్ద భవనాలపై ఇజ్రాయెల్ దాడులు చేసినట్లు పేర్కొంది. ఈ క్రమంలోనే యుద్ధం ప్రారంభం నుంచి ఇప్పటివరకు గాజాలో 15,200 మంది మృతి చెందినట్లు గాజా ఆరోగ్య విభాగం ప్రకటించింది. చనిపోయినవారిలో మూడింట రెండొంతులు మహిళలు, చిన్నారులేనని వెల్లడించింది. మరో 40 వేల మంది పౌరులు గాయపడినట్లు తెలిపింది. ఇటీవల గాజాలో కాల్పుల విరమణ, బందీల బదిలీ ఒప్పందంతో వారం రోజుల పాటు దాడులకు విరామం ఇచ్చారు. అయితే శుక్రవారం మళ్లీ మొదలయ్యాయి. హమాస్‌ మొదట ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఇజ్రాయెల్‌ వైమానిక, భూతల దాడులకు దిగడం వల్ల బందీల విడుదల ఆగిపోయింది.

నెతన్యాహు కొత్త స్కెచ్!
Israel Hamas Ceasefire : మరోవైపు గాజాలోని మిలిటెంట్లు కూడా ఇజ్రాయెల్​పై రాకెట్ దాడులు చేస్తున్నారు. హమాస్‌ను పూర్తిగా అంతం చేయాలని భావిస్తున్న ఇజ్రాయెల్ ఓ ప్రణాళికను రచిస్తున్నట్లు ప్రముఖ వార్తా పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ప్రపంచ దేశాల ఒత్తిడితో ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ఆగినా నెతన్యాహు సర్కార్ ప్రణాళికను అమలు చేయనుందని తెలిపింది. ఇందుకోసం ఇ‌జ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్‌కు ప్రధాని నెతన్యాహు ఆదేశాలు జారీ చేశారని నివేదికలో వెల్లడించింది. సాధారణంగా హమాస్‌లోని కీలక నేతలంతా తుర్కియే, లెబనాన్‌, ఖతార్‌ దేశాల్లో ఉంటున్నారు. అక్కడి నుంచే కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. వాళ్లను మట్టుబెట్టేందుకు ట్రాక్‌ హంట్‌ కిల్‌ అనే సూత్రాన్ని ఇజ్రాయెల్‌ పాటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇజ్రాయెల్ లక్ష్యంగా పెట్టుకున్న వారిలో హమాస్‌కు సేవలందించిన పాలస్తీనా మాజీ ప్రధాని హనియే ఉన్నట్లు తెలుస్తోంది. హమాస్ ఎజ్డైన్ అల్-కస్సామ్ బ్రిగేడ్స్‌కు నాయకత్వం వహిస్తున్న మొహమ్మెద్ డీఫ్ గతంలో లీడర్‌గా వ్యవహరించిన సిన్వార్ కూడా ఉన్నట్టు సమాచారం. హమాస్ పొలిట్‌ బ్యూరో వ్యవస్థాపక సభ్యుడు ఖలేద్ మషాల్ కూడా ఇజ్రాయెల్ అంతమొందిచాల్సిన వారిలో ఉన్నట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. మరోవైపు ఇజ్రాయెల్ కార్యకలాపాలపై మాజీ మొసాద్ డైరెక్టర్ ఇఫ్రేమ్ హాల్వే ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు అనాలోచిత పరిణామాలను కలిగిస్తాయని అది ఇజ్రాయెల్‌కు ముప్పు తెస్తుందని హెచ్చరించారు.

యుద్ధం మళ్లీ మొదలు- గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు

గాజాలో మళ్లీ కాల్పుల మోత.. ఇజ్రాయెల్‌ దాడిలో 178 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details