తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇజ్రాయెల్ భీకర దాడులు- ఒకే కుటుంబంలో 76 మంది మృతి- గాజాపై 208 విధ్వంసకర బాంబుల ప్రయోగం!

Israel Bomb Attack On Gaza : అక్టోబర్ 7నాటి హమాస్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ భూతల దాడులు చేస్తూనే గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ప్రాణాలు కాపాడుకోవాలంటే ఉత్తర గాజా నుంచి దక్షిణ గాజాకు తరలివెళ్లాలని పాలస్తీనా వాసులకు సూచించిన ఇజ్రాయెల్, అక్కడ కూడా దాడులు చేసింది. ఏకంగా 2 వేల పౌండ్ల అత్యంత విధ్వంసక బాంబులను దక్షిణ గాజాపై ఇజ్రాయెల్‌ జారవిడిచినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఆ బాంబుల వల్ల ఏర్పడిన 2 వందలకుపైగా గుంతలే అందుకు సాక్ష్యమని పేర్కొంది.

Israel Bomb Attack On Gaza
Israel Bomb Attack On Gaza

By PTI

Published : Dec 23, 2023, 9:25 PM IST

Updated : Dec 24, 2023, 6:28 AM IST

Israel Bomb Attack On Gaza : హమాస్‌ను నిర్మూలించడమే తమ లక్ష్యమని ప్రకటించిన ఇజ్రాయెల్, గాజాపై పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఖాన్‌యూనిస్‌ పట్టణంపై భీకర దాడులు చేసి హమాస్ నేతల స్థావరాలు, సొరంగాలు కూల్చివేసిన ఇజ్రాయెల్, రఫా పట్టణంపైనా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం రెండు ఇళ్లపై జరిపిన బాంబు దాడిలో 90 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఉమ్మడి కుటుంబానికి చెందిన 76 మంది ఉన్నారు. ఈ ఘటనలో పిల్లలు, మహిళలు సైతం ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఐక్యరాజ్య సమితికి చెందిన అధికారి సైతం ఉన్నట్లు చెప్పారు.

Israel Bombing News Today : సామాన్య ప్రజలకు హాని కలగకుండా దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ చెప్పినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉందని ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మొదలైన తొలి 6 వారాల్లో ప్రజల్ని దక్షిణ గాజాకు తరలివెళ్లాలని నెతన్యాహూ ప్రభుత్వం సూచించిందని న్యూయార్క్ టైమ్స్‌ గుర్తు చేసింది. అయితే దక్షిణ గాజాలో పౌరులు ఎక్కువగా ఉన్న చోట అత్యంత శక్తిమంతమైన 2 వేల పౌండ్‌ల బాంబులను ఇజ్రాయెల్‌ జారవిడిచిందని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. అందుకు సాక్ష్యంగా బాంబులు పడిన చోట ఏర్పడిన 208 గుంతలను కృత్రిమ మేధ సాయంతో గుర్తించినట్టు తెలిపింది.

దక్షిణ గాజాలో ఉపగ్రహ చిత్రాలను AI సాంకేతికతను వినియోగించి తాము గుంతలను విశ్లేషించినట్టు చెప్పిన న్యూయార్క్ టైమ్స్ ఒక్కో గుంత 40 అడుగుల విస్తీర్ణంలో ఉందని చెప్పింది. ఈ స్థాయిలో క్రేటర్లు ఏర్పడాలంటే విధ్వంసకర బాంబులు వినియోగించి ఉండొచ్చని నిపుణుల ద్వారా తెలిసిందని వివరించింది. పశ్చిమ దేశాలు కూడా ఈ తరహా విధ్వంసక బాంబులను వాడతాయని కానీ జనావాసాల్లో మాత్రం ఉపయోగించవని న్యూయార్క్‌ టైమ్స్‌ వెల్లడించింది.

ఇటీవల దక్షిణ గాజాలోని శరణార్థి శిబిరాలు, ఆస్పత్రులే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసిందని ఆరోపణలు వచ్చిన తరుణంలో ఈ నివేదిక బయటకు వచ్చింది. ఇజ్రాయెల్ దాడులతో ఇటీవల అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని గాజా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తాజాగా సెంట్రల్ గాజాలోని నుసెయిరాట్ శిబిరంపై జరిగిన దాడిలో 18 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపాయి. న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. పౌరులకు హాని కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకునే తాము దాడులు చేస్తామని పేర్కొంది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య దాడులు మొదలైన నాటి నుంచి 20 వేల మంది తమ పౌరులు ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్యశాఖ ప్రకటించింది. హమాస్ దాడుల్లో 132 మంది తమ ప్రజలు మృతి చెందారని ఇప్పటికే ఇజ్రాయెల్ తెలిపింది.

బయటపడ్డ హమాస్ టన్నెల్​​- భూగర్భంలో స్పెషల్​ రూమ్స్- కరెంట్​, సెక్యూరిటీ కెమెరాలు కూడా!

సొంత బందీలను చంపిన ఇజ్రాయెల్​- శత్రువులుగా పొరపాటుపడ్డామన్న సైన్యం

Last Updated : Dec 24, 2023, 6:28 AM IST

ABOUT THE AUTHOR

...view details