Israel Attack On Rafah : ఇజ్రాయెల్ దాడులతో గాజాపట్టీలో ప్రజల జీవితాలు నరకప్రాయంగా మారాయి. గాజాపై యుద్ధాన్ని పలు దఫాలుగా విభజించుకున్న ఇజ్రాయెల్ సైన్యం నిరంతర దాడులతో ముందుకు కదులుతున్నాయి. గాజా సిటీని సర్వనాశనం చేసిన నెతన్యాహు సేనలు ఖాన్ యూనిస్, రఫా నగరాలపై విరుచుకుపడుతున్నాయి. ఇంటింటినీ జల్లెడ పట్టి అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నాయి. ఇటీవల గాజాలో డజన్ల సంఖ్యలో యువకులను బట్టలు విప్పించి సామూహికంగా హత్య చేసిందన్న వార్తలు సామాజిక మాధ్యమాల్లో వినిపించాయి. ఐడీఎఫ్ దాడులతో రఫాలోని చాలా ప్రాంతాలు శిథిలాల కుప్పగా మారాయి. రఫాపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన సరిహద్దు దేశం ఈజిప్టు తమ పౌరులను పరిసర గ్రామాలు, పట్టణాల నుంచి ఖాళీ చేయించింది.
దాడులు ఎడతెరిపి లేకుండా సాగుతుండటం వల్ల గాజాలో మానవతాసాయానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ప్రజలకు ఒక్కపూట తిండి దొరకడం కష్టంగా మారడం వల్ల ఎక్కడ చూసినా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. చాలాచోట్ల మానవతాసాయం అందిస్తున్న ట్రక్కులపై దాడులు జరుగుతున్నాయి. ట్రక్కులు ఆగకముందే వాటిపైకి ప్రజలు ఎగబడుతున్నారు.
మధ్యధరా సముద్ర తీర ప్రాంతంలోని మువైసీ అనే చిన్న భూభాగాన్ని ఇజ్రాయెల్ ప్రస్తుతం సేఫ్ జోన్‌గా ప్రకటించింది. గాజాలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు తరలివచ్చిన ప్రజలు ఇక్కడ దురవస్థలు పడుతున్నారు. నీటితో నిండిపోయిన చిత్తడి మైదానాల్లో టెంట్లు వేసుకుని వేలాది మంది పాలస్తీయన్లు కాలం వెల్లదీస్తున్నారు. కేవలం 20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న మువైసీకి శరణార్థులు భారీగా తరలి వస్తున్నారు. రాత్రిపూట చలి ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలు డయేరియా బారిన పడుతున్నారు. బాత్రూమ్లు లేకపోవడం వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.