Iraq University Fire Accident :ఇరాక్‌లోని ఓ యూనివర్సిటీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 14 మంది దుర్మరణం పాలయ్యారు. ఇర్బిల్ నగరంలో సోరన్ యూనివర్సిటీలోని వసతిగృహంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఆ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా, తొమ్మిది మంది గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారని అధికారులు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా చుట్టుపక్కల నివాసితులను ఖాళీ చేయించినట్లు వెల్లడించారు. ఈ వసతిగృహంలో విద్యార్థులు, లెక్చరర్లు కలిసి ఉంటారని అధికారులు తెలిపారు.
ప్రధాని తీవ్ర సంతాపం, దర్యాప్తునకు ఆదేశం
Iraq Fire Accident Today :శుక్రవారం రాత్రి వసతి గృహంలోని మూడు, నాలుగు అంతస్థుల్లో మంటలు చేలరేగినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. అయితే, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా గుర్తించినట్లు అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంపై కుర్దిస్థాన్ ప్రధానమంత్రి మస్రౌర్ బర్జానీ సంతాపం వ్యక్తం చేశారు. సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.