Iran Earthquake: అఫ్గానిస్థాన్‌లో పెను భూకంపం నమోదైన నాలుగు రోజుల తర్వాత ఇరాన్లో శనివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.6 తీవ్రత నమోదైంది. దీంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. . కిష్ ప్రాంతం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఈశాన్య భాగంలో, 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
పెను విషాదం.. అఫ్గానిస్థాన్‌లో సంభవించిన పెను భూకంపంలో మృతుల సంఖ్య శుక్రవారం 1,150కి పెరిగింది. పక్తికా, ఖోస్త్ ప్రావిన్సుల్లో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘోర విపత్తు అపార నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. భూకంపం కారణంగా సుమారుగా 3,000 ఇళ్లు ధ్వంసమైనట్లు ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఒక్క గయాన్ జిల్లాలోనే వెయ్యి ఇళ్లు దెబ్బతిన్నాయి. ఓవైపు భారీ వర్షాలు కురుస్తుండటం.. మరోవైపు పెద్దఎత్తున కొండచరియలు విరిగిపడటం వల్ల అధికసంఖ్యలో ఇళ్లు నేలమట్టం కాగా.. ప్రజలు నిలువ నీడలేని స్థితిలో దుర్భర జీవనం సాగిస్తున్నారు. అఫ్గాన్‌లో పక్తికా ప్రావిన్సు గయాన్ జిల్లాలో శుక్రవారం మళ్లీ భూకంపం సంభవించింది. దీంతో అయిదుగురు పౌరులు మృత్యువాత పడగా, 11 మంది గాయపడ్డారు.