తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇరాన్​లో భారీ పేలుళ్లు- 103మంది మృతి, 188మందికి గాయాలు - ఇరాన్ లేటెస్ట్ న్యూస్

Iran Blast Today : ఇరాన్​లో జరిగిన బాంబు దాడుల్లో 103 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 188మంది గాయపడ్డారు. ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్​కు చెందిన ఖుద్స్‌ ఫోర్స్‌కు నేతృత్వం వహించిన ఖాసీం సులేమాని సంస్మరణ సభలో బుధవారం జరిగిందీ దుర్ఘటన.

iran blast today
iran blast today

By PTI

Published : Jan 3, 2024, 6:38 PM IST

Updated : Jan 3, 2024, 9:32 PM IST

Iran Blast Today :ఇరాన్‌లో జరిగిన రెండు వరుస బాంబు దాడుల్లో 103 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 188మంది గాయపడ్డారు. 2020లో అమెరికా జరిపిన డ్రోన్‌ దాడిలో జనరల్ ఖాసీం సులేమానీ చనిపోగా ఆయన నాలుగో వర్ధంతి సందర్భంగా సమాధి వద్ద జరిగిన కార్యక్రమంలో ఈ బాంబు పేలుళ్లు జరిగాయి. జనరల్ ఖాసిమ్ సమాధి వద్దకు వందలాది మంది నడుచుకుంటూ వెళుతుండగా బాంబు పేలుళ్లు జరిగాయని ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. మరోవైపు, ఇది ఉగ్రవాద దాడేనని కెర్మన్ డిప్యూటీ గవర్నర్‌ తెలిపారు. మరోవైపు, ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఈ పేలుళ్లు జరిగాయి. గాజాపై దాడులను ఇరాన్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

Qassem Soleimani Funeral :ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌లోని అత్యంత శక్తిమంతమైన ఖుద్స్‌ ఫోర్స్‌కు నేతృత్వం వహించిన ఖాసీం సులేమానీ 2020 జనవరి 3న అమెరికా జరిపిన వైమానిక దాడిలో మరణించారు. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ దాడికి అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఆదేశాలు ఇచ్చారు. దానిపై అప్పట్లో ఇరాన్ ప్రతీకార దాడులు కూడా చేసింది. బుధవారం ఆయన నాలుగో వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పేలుళ్లు జరిగాయి. ఇదిలా ఉండగా 2020లో ఖాసీం సులేమానీ అంత్యక్రియల సమయంలోనూ తొక్కిసలాట జరిగి 56 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఖాసీం సులేమానీ హత్య తర్వాత టెహ్రాన్‌ కోర్టులో 3,300 దావాలు దాఖలయ్యాయి. వాటిని విచారించిన న్యాయస్థానం ఇరాన్‌కు అమెరికా ప్రభుత్వం 50 బిలియన్ల డాలర్లు పరిహారంగా చెల్లించాలని గతేడాది డిసెంబరులో ఆదేశాలు ఇచ్చింది. ట్రంప్‌, యూఎస్ ప్రభుత్వంతోపాటు 42 మంది వ్యక్తులను దోషులుగా గుర్తించిందని స్థానిక వార్తాసంస్థ పేర్కొంది. తమ పౌరులను కాపాడుకోవడం కోసమే అమెరికా ఈ దాడికి పాల్పడినట్లు అప్పట్లోనే ట్రంప్ ప్రకటించారు. అగ్రరాజ్య దౌత్యాధికారులు, సైనికులే లక్ష్యంగా సులేమానీ దాడులకు సన్నాహాలు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. అందుకే ఆయన్ను హతమార్చాల్సి వచ్చిందని తెలిపారు.

Last Updated : Jan 3, 2024, 9:32 PM IST

ABOUT THE AUTHOR

...view details