IPhone Fall From Flight : సాధారణంగా మన చేతుల నుంచి కింద పడిపోతేనే కొన్ని ఫోన్లు పగిలిపోయి పని చేయకుండా పోతాయి. అలాంటిది సుమారు 16వేల అడుగుల ఎత్తు నుంచి కిందపడిపోయింది ఓ ఫోన్. ఇంకేముంటుంది అని ఫోన్‌పై ఆశలు వదిలేసుకుంటారు. కానీ అంత ఎత్తు నుంచి పడిపోయిన ఈ ఫోన్ మాత్రం సగం బ్యాటరీ ఛార్జింగ్‌తో అద్భుతంగా పనిచేస్తుంది. ఇటీవల ఎమెర్జెన్సీ ల్యాండింగ్ అయిన అలస్కా ఎయిర్‌లైన్స్ విమానం నుంచి పడిపోయిన ఫోన్ పనిచేస్తూనే దొరికింది. ఓ వ్యక్తి ఎక్స్‌లో పోస్ట్ చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
"రోడ్డు పక్కన వెళ్తుండగా నాకు ఓ ఐఫోన్ దొరికింది. ఇప్పటికీ ఫోన్ సగం బ్యాటరీ ఛార్జింగ్‌తో ఎయిర్‌ప్లేన్ మోడ్‌లోనే ఉండి పనిచేస్తుంది. అలస్కా ఎయిర్‌లైన్స్ నుంచి కిందపడిపోయిన ప్రయాణికుడి ఫోన్ అయ్యి ఉంటుంది. విమానం నుంచి పడిపోయిన రెండో ఫోన్ దొరికింది. కానీ ఊడిపోయిన ఆ డోర్ మాత్రం ఇప్పటికి లభించలేదు." అని సీనాథన్ బేట్స్ అనే నెటిజన్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. అలస్కా ఎయిర్‌లైన్స్ బ్యాగేజ్ క్లెయిమ్‌కు సంబంధించిన వివరాలు ఆ ఫోన్లో ఉండడాన్ని ప్రస్తావిస్తూ ఐఫోన్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు బేట్స్. అయితే, ఇది ఏ మోడల్ ఫోన్ అనే విషయం మాత్రం గుర్తించడం కష్టంగా మారింది. ప్రాథమికంగా ఐఫోన్ 12 ప్రో లేదా ఐఫోన్ 13 ప్రోగా భావిస్తున్నారు. హార్డ్ కేసు ఉండడం వల్ల ఫోన్ పగిలిపోకుండా ఉందని అనుకుంటున్నారు.
ఇదీ జరిగింది
జనవరి 5న అమెరికాలోని పోర్ట్‌లాండ్ నుంచి ఒంటారియోకు బయలుదేరిన బోయింగ్ 737-9 మ్యాక్స్ విమానం టేకాఫ్ అయిన వెంటనే దాని డోర్ ఊడిపడిపోయింది. దాంతో టేకాఫ్ అయిన చోటే అత్యవసరంగా దిగింది. 16 వేల అడుగుల ఎత్తులో ఈ ఘటన జరగడం వల్ల ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. విమానంలోని పలువురి ప్రయాణికులకు సంబంధించిన ఫోన్లు సహా ఇతర వస్తువులు కిందపడిపోయాయి. విమానంలోని 174 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది సుక్షితంగా బయటపడటం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీనిపై అలస్కా ఎయిర్‌లైన్స్‌తో పాటు యూఎస్ నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్(ఎన్‌టీఎస్‌బీ) కూడా దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపింది.