Ukraine Russia War: వారాల తరబడి పోరాడిన ఉక్రెయిన్ సైనికుల్లో దాదాపు వెయ్యి మంది తమకు లొంగిపోయారని రష్యా ప్రకటించింది. మేరియుపొల్ నగరంలోని అజోవ్‌స్తల్ ఉక్కు కర్మాగార ఆవరణను పుతిన్ సేనలు మంగళవారం స్వాధీనం చేసుకొని, అక్కడి నుంచి పలువురు ఉక్రెయిన్ సైనికుల్ని తమ నియంత్రణలోని భూభాగంలోకి తరలించిన విషయం తెలిసిందే. ఇది తరలింపా, లొంగుబాటా అనే అనుమానాలున్న నేపథ్యంలో రష్యా రక్షణ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కొనషెన్‌కోవ్ బుధవారం స్పష్టతనిచ్చారు. కర్మాగార ప్రాంగణాన్ని వీడి 959 మంది బయటకు వచ్చారని చెప్పారు.
ఖైదీల మార్పిడి కింద వీరిని తిరిగి వెనక్కి తీసుకువస్తామని ఉక్రెయిన్ ఆశాభావం వ్యక్తం చేస్తుండగా, రష్యా మాత్రం వారిలో కొందరినైనా యుద్ధ నేరాల కింద విచారించబోతున్నట్లు తెలుస్తోంది. రష్యాలో ఆ మేరకు ఒత్తిడి పెరుగుతోంది. పౌరులపై నేరాలకు పాల్పడినవారిని గుర్తించడానికి ఉక్రెయిన్ సైనికుల్ని విచారిస్తామని రష్యా దర్యాప్తు సంస్థ తెలిపింది. అక్కడి అజోవ్ రెజిమెంట్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని సుప్రీంకోర్టును కోరే ప్రయత్నాలు మొదలయ్యాయి. కర్మాగార ఆవరణలోని బంకర్లలో దాదాపు 2,000 మంది ఉంటారని ఒక దశలో అంచనా వేసినా, ప్రస్తుతం ఇంకా ఎందరు అక్కడ మిగిలారనేది స్పష్టం కావడం లేదు. మేరియుపొల్‌కు చెందిన దాదాపు మూడువేల మంది పౌరుల్ని ఒలెనివ్కా సమీపంలోని ప్రాంతానికి రష్యా సైన్యం తరలించిందని ఉక్రెయిన్ మానవ హక్కుల అంబుడ్స్‌మన్ తెలిపారు.