రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీసీ) అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 'ఉక్రెయిన్‌లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యాకు పిల్లలను చట్టవిరుద్ధంగా పంపించడం తదితర నేరాలకు వ్లాదిమిర్ పుతిన్ బాధ్యుడు' అందుకే ఆయనను అరెస్టు చేసేందుకు వారెంట్ జారీ చేశామని అంతర్జాతీయ న్యాయస్థానం స్పష్టం చేసింది. అలాగే రష్యా బాలల హక్కుల కమిషనర్ మారియా ల్వోవా బెలోవాకు కూడా ఐసీసీ అరెస్ట్ వారెంట్ ఇచ్చినట్లు తెలిపింది.
ఉక్రెయిన్‌లోని ఆక్రమిత ప్రాంతాల్లోని చిన్నారులను రష్యాకు చట్టవిరుద్ధంగా రవాణా చేస్తూ యుద్ధ నేరాలకు పాల్పడినందుకు ప్రతి అనుమానితుడు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా అంతర్జాతీయ న్యాయస్థానం ప్రీ ట్రయల్ ఛాంబర్ పేర్కొంది. భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాల్లో ఓ దేశం అధినేతకు ఇలా వారెంటు జారీకావడం ఇదే తొలిసారి .
మరోవైపు అంతర్జాతీయ న్యాయస్థానం వ్లాదిమిర్ పుతిన్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేయడంపై రష్యా స్పందించింది. ఇది దారుణమైన, ఆమోదయోగ్యం కాని వ్యవహారమని అని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. తాము ఐసీసీని గుర్తించడం లేదని తెలిపారు. అందువల్ల ఐసీసీ చర్యలు చట్టపరంగా చెల్లుబాటుకావని వెల్లడించారు. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, రష్యా బాలల హక్కుల కమిషనర్ మారియా ల్వోవాకు ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేయడాన్ని ఉక్రెయిన్ స్వాగతించింది.
గతంలో అంతర్జాతీయ న్యాయస్థానం అంతర్జాతీయ న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసిన వారిలో సెర్బియా మాజీ అధ్యక్షుడు స్లొబొదన్ మిలోసెవిక్, ఆ దేశ సైనిక మాజీ కమాండర్ రాట్‌కో మ్లాడిక్, లైబీరియా మాజీ అధ్యక్షుడు చార్లెస్ టైలర్ ఉన్నారు.
షీ జిన్‌పింగ్ పర్యటన..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని శాంతియుతంగా చర్చలు జరిపి ఆపడమే లక్ష్యంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రష్యాలో పర్యటించనున్నారు. ముచ్చటగా ముడోసారి చైనా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన షీ జిన్‌పింగ్ ఆ హోదాలో మొదటిసారి ఈ విదేశీ పర్యటన చేయనున్నారు. ఇందుకోసం ఆయన మూడురోజుల పాటు రష్యాలోనే పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిసి ఉక్రెయిన్‌తో యుద్ధం సహా మరిన్ని కీలక అంశాలపై ఆయన చర్చలు జరపనున్నారు. దీనికి సంబంధించిన ప్రకటనను చైనా విదేశాంగ కార్యాలయం శుక్రవారం విడుదల చేసింది.
ఈ పర్యటనలో ముఖ్యంగా ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని శాంతియుతంగా చర్చలు జరిపి ముగించాలని జిన్‌పింగ్ కోరనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ తెలిపారు. ఈ పర్యటన మార్చి 20 నుంచి 22 వరకు కొనసాగుతుందని చెప్పారు. ఇద్దరి దేశాధ్యక్షులు.. రష్యా, చైనా మధ్య సమగ్రమైన భాగస్వామ్యం, భవిష్యత్తులో వ్యూహాత్మకమైన పరస్పర సహకారంతో పాటు అనేక సంబంధిత అంశాలపై చర్చించనున్నారని రష్యా అధికార భవనం క్రెమ్లిన్ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే ఈ చర్చల్లో ద్వైపాక్షిక పత్రాలపై కూడా సంబంధిత అధికారులు సంతకాలు చేస్తారని రష్యా ప్రభుత్వ అధీనంలోని టాస్ వార్తా సంస్థ వెల్లడించింది.