infectious diseases in pakistan : పాకిస్థాన్‌లోని దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లో వరద నీరు తగ్గుముఖం పడుతున్నా అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ ప్రావిన్స్‌లోని ప్రజలు మలేరియా, డెంగీ, డయేరియా, చర్మ సహా అనేక వ్యాధులు బారినపడుతున్నారు. కలుషిత నీటి వల్ల సంక్రమించే వ్యాధుల విజృంభణ తీవ్రస్థాయికి చేరిందని పాక్ అధికారులు తెలిపారు. వరదల ధాటికి నిరాశ్రయులైన లక్షల మందికి తాత్కాలిక ఆశ్రయం కల్పించిన శిబిరాల్లోనూ అంటువ్యాధులు వ్యాపిస్తున్నాయి. పాకిస్థాన్‌లో అంటు వ్యాధుల విజృంభణపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.
సింధ్ ప్రావిన్స్‌లో 60 నుంచి 70 శాతం రక్త నమూనాల్లో మలేరియా ఉన్నట్లు జఫరాబాద్ మెడికల్ సూపరింటెండెంట్ ఇమ్రాన్ బలోచ్ తెలిపారు. రెండు రోజుల వ్యవధిలోనే 37 వేల మంది అంటువ్యాధుల బారినపడ్డారని వైద్యులు వెల్లడించారు. సింధ్‌లో లక్షలాది మంది తాత్కాలిక గృహాలు గుడారాల్లో నివసిస్తుండగా వరద నీరు పూర్తిగా తగ్గడానికి కొన్ని నెలల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఈ కలుషిత నీటి వల్లే చర్మవ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని వైద్యులు వెల్లడించారు. పాక్‌లో వరదల కారణంగా 18 లక్షల ఇళ్లు దెబ్బతినగా 400 వంతెనలను ధ్వంసమయ్యాయి. 50 లక్షల కంటే ఎక్కువ మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.