ఒక్కరిని పెళ్లి చేసుకుని సంసార సాగరాన్ని ఈదడమే కష్టమంటే.. ఈ వ్యక్తి ఏకంగా 88వ సారి పెళ్లికి సిద్ధమయ్యాడు. కాన్.. ఇండోనేసియాకు చెందిన రైతు. తన 14వ ఏట.. తనకంటే రెండు సంవత్సరాలు ఎక్కువ వయసున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అలా రెండు సంవత్సరాలు గడిచాయి. అనంతరం అతడి ప్రవర్తన నచ్చక మొదటి భార్య విడిపోయింది. మొదటి భార్య దూరమవడం వల్ల ఎలాగైనా మహిళలు తన కోసం వెర్రెత్తిపోయేలా చేసుకోవాలిని ఆధ్యాత్మికత వైపు మళ్లాడు. అలా లాంగ్ గ్యాప్లో 85 పెళ్లిళ్లు అయిపోయాయి. వారితో విడిపోవడమూ జరిగిపోయింది.
కట్ చేస్తే అతడి జీవితంలోకి అడుగు పెట్టింది నంబర్ 86. అలా కొంతకాలం గడిచిపోయింది. అనంతరం నంబర్ 86తో కూడా తెగదెంపులు చేసుకున్నాడు కాన్. అలవాటైన పనే కనుక మరోసారి నెంబర్ 87ను పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే అలవాటులో గ్రహపాటు.. రెండు నెలలు గడవకముందే ఈ పెళ్లి కూడా పెటాకులైంది. దీంతో 88వ పెళ్లికి సిద్ధమయ్యాడు. యాదృచ్ఛికం ఏమోగానీ నంబర్ 86 పేరు మార్చుకుని 88 అయ్యింది. అంటే ఈసారి పెళ్లికుమార్తె.. కాన్ మాజీ భార్యే. ఇప్పటికైతే ఈ కథ సుఖాంతం అయ్యింది. మున్ముందు ఏం జరుగుతుందో.. ఈ నంబర్ ఎక్కడి వరకు వెళ్తుందో వేచిచూడాలి.