Indonesia Premartial Sex: పెళ్లికిముందు శృంగారంతో పాటు సహజీవనాన్ని నిషేధించేందుకు ఇండోనేసియా సిద్ధమైంది. ప్రభుత్వ సిద్ధాంతాలు, విలువలకు వ్యతిరేకంగా దేశాధ్యక్షుడు లేదా సంస్థలను కించపరిచే వ్యాఖ్యలపైనా ఆంక్షలు విధించనుంది. ఒకవేళ వీటిని అతిక్రమిస్తే ఏడాదిపాటు జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధించనుంది. ఇందుకోసం నూతన చట్టాన్ని తెచ్చేందుకు సిద్ధమైనట్లు ఇండోనేసియా ప్రభుత్వం వెల్లడించింది. వీటికి సంబంధించిన క్రిమినల్ కోడ్ ముసాయిదాను ఈ నెలలోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇదే విషయంపై దేశ ఉప న్యాయశాఖ మంత్రి, మానవ హక్కుల సంఘంతో ఇటీవల జరిగిన భేటీ అనంతరం తాజా విషయం వెల్లడైంది.
పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొంటే ఆ దేశంలో ఏడాది జైలు శిక్ష.. భారీ జరిమానా! - ఇండోనేసియా వార్తలు
పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొనడం, సహజీనవం వంటి వాటిని నిషేధించేందుకు ఇండోనేసియా సిద్ధమైంది. వీటితోపాటు మరికొన్ని నిబంధనలతో కూడిన నూతన ముసాయిదా చట్టాన్ని త్వరలోనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది.
'పెళ్లికి ముందు శృంగారం, సహజీవనం చేయడం నిషేధం. భార్య లేదా భర్త లేనివారితోనూ ఎవరైనా శృంగారంలో పాల్గొంటే, వారిని వ్యభిచారం కింద శిక్షిస్తాం. కేటగిరి-2 కింద గరిష్ఠంగా ఏడాది పాటు జైలు శిక్ష లేదా భారీ జరిమానా ఉంటుంది' అని ముసాయిదాలో పేర్కొంది. ఇండోనేసియా పౌరులతోపాటు విదేశీయులకు ఇవే నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఇదే విషయంపై మాట్లాడిన దేశ ఉప న్యాయశాఖమంత్రి ఎడ్వార్డ్ ఒమర్ షరీఫ్ హియారిజ్.. ఇండోనేసియా విలువలకు తగినట్లుగా కొత్త చట్టం ఉండటం తమకెంతో గర్వకారణమని అన్నారు.
ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఇండోనేసియా.. మహిళలు, మతపరమైన మైనారిటీలు, స్వలింగ సంపర్కులపై ఎన్నో ఆంక్షలు విధిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ.. స్థానిక విలువలకు అనుగుణంగా నేర నియంత్రణ కోసం కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు ఈ దేశం కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా రూపొందించిన నూతన ముసాయిదా చట్టం.. 2019లోనే ఆమోదం పొందాల్సి ఉంది. కానీ, దీనిపై జాతీయస్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ కొత్త చట్టం.. పౌర స్వేచ్ఛను అణచివేసేలా ఉందని వేల మంది ఆందోళనలకు దిగారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం.. ప్రజలతో సంప్రదింపులు జరిపి, కొన్ని మార్పులతో ఈ నూతన చట్టాన్ని తీసుకువచ్చేందుకు సిద్ధమైంది.