Indo Americans Family Died In US : అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మసాచుసెట్స్ రాష్ట్రంలోని విలాసవంతమైన ఓ భవనంలో వారి మృతదేహాలను గురువారం రాత్రి గుర్తించారు పోలీసులు. మృతులు రాకేశ్ కమల్(57), ఆయన భార్య టీనా(54), కుమార్తె అరియానా(18) గుర్తించారు.
రెండురోజుల నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడం కారణంగా వారి బంధువు పోలీసులకు సమాచారం ఇవ్వటం వల్ల ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రాకేశ్ కమల్ మృతదేహం వద్ద తుపాకీ ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. గృహహింసా లేక ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బయటి వ్యక్తుల ప్రమేయంపైనా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
ఉన్నత విద్యావంతులు
2016లో ఎడ్యునోవా పేరిట విద్యారంగానికి చెందిన ఓ సంస్థను ప్రారంభించారు రాకేశ్ కమల్ దంపతులు. దాని కార్యకలాపాలు 2021లో నిలిచిపోయాయి. సంస్థ వెబ్‌సైట్ ప్రకారం బోస్టన్ విశ్వవిద్యాలయం, ఎంఐటీ సోలన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయాల నుంచి రాకేశ్ పట్టాలు పొందారు. ఈయనకు విద్యారంగంలో అపారమైన అనుభవం ఉంది. టీనా హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన పూర్వ విద్యార్థి. ఈమెకు రెడ్‌క్రాస్ ఛారిటీ బోర్డులో పనిచేసిన అనుభవం ఉంది.