Indians In France Human Trafficking :మానవ అక్రమ రవాణా అనుమానంతో ఫ్రాన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్న 303 మంది భారతీయ ప్రయాణికులున్న విమానానికి ఆటంకాలు తొలిగాయి. మూడు రోజులు నిర్బంధం అనంతరం ఈ విమానం సోమవారం మళ్లీ బయలుదేరనుంది. అయితే షెడ్యూల్ ప్రకారం నికరాగువాకు వెళుతుందా? వెనక్కి మళ్లించి దుబాయికి చేరుతుందా లేదా భారత్‌కు పయనం అవుతుందా? అన్నది అధికారులు వెల్లడించలేదు.
విచారణ జరిపిన నలుగురు న్యాయమూర్తుల ప్యానెల్
ఫ్రెంచ్ నిబంధనల ప్రకారం ఈ ఘటనపై ఆదివారం న్యాయవిచారణ ప్రారంభమైంది. విమానాన్ని అధీనంలోకి తీసుకున్న వాట్రీ విమానాశ్రయంలోనే న్యాయవిచారణకు ఫ్రాన్స్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నలుగురు న్యాయమూర్తుల ప్యానల్ బహిరంగ విచారణ చేపట్టారు. అనంతరం విమానం బయలుదేరేందుకు అనుమతులు రావడం వల్ల విచారణ ప్రక్రియలో లోపాలు ఉన్నాయని జడ్జీలు హియరింగును రద్దు చేశారు. విమాన ప్రయాణికుల్లో కొందరు తమ బంధువులతో ఫోన్లలో హిందీ, తమిళంలో మాట్లాడారని ఫ్రెంచ్ మీడియా పేర్కొంది. ఓ కంపెనీ క్లయింట్ కోసం విమానాన్ని నడిపామని, మానవ అక్రమ రవాణా అరోపణలతో తమకు సంబంధం లేదని రొమేనియాకు చెందిన లెజెండ్ ఎయిర్‌లైన్స్‌కు న్యాయవాది తెలిపారు.