Indians in Biden administration: అమెరికా జనాభాలో భారత సంతతి వారు 1 శాతమే అయినా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వంలోని వివిధ విభాగాలలో ఏకంగా 130 మంది భారతీయులు ఉన్నత పదవులు దక్కించుకున్నారు. ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ను బైడెన్ ఎంపిక చేసుకున్న విషయం విదితమే. భారతీయులకు మునుపటి అమెరికా అధ్యక్షులు ఇచ్చిన పదవులకన్నా చాలా ఎక్కువ పదవులను బైడెన్ ఇచ్చారు. ప్రభుత్వంలోని అన్ని విభాగాలూ, సంస్థల్లో భారతీయులు ముఖ్య స్థానాలను అలంకరిస్తున్నారు.
పూర్వ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ మొట్టమొదటిసారిగా ఒక భారతీయుడికి ఉన్నత పదవి ఇవ్వగా, బరాక్ ఒబామా 60 మందికి పైగా, డోనాల్డ్ ట్రంప్ 80 మందికిపైగా భారతీయులను నియమించారు. ఇప్పుడు బైడెన్ ఆ రికార్డును బద్దలుకొట్టారు. భారతీయ అమెరికన్లకు అత్యధిక ప్రాతినిధ్యం కల్పిస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈసారి 40 మందికిపైగా భారత సంతతి వారు రాష్ట్రాల చట్టసభలకు, ఫెడరల్ లెజిస్లేచర్‌కూ ఎన్నికయ్యారు. వీరిలో నలుగురు అమెరికా కాంగ్రెస్‌లో (పార్లమెంటు) దిగువ సభకు ఎన్నికయ్యారు. మరో నలుగురు వివిధ అమెరికన్ నగర పాలికలకు మేయర్లు అయ్యారు. పలువురు భారతీయ అమెరికన్లు విదేశాల్లో యూఎస్ రాయబారులుగా నియమితులయ్యారు.
- విఖ్యాత అమెరికన్ కంపెనీలకు పలువురు భారతీయ అమెరికన్లు సారథ్యం వహిస్తున్నారు. వారిలో సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్), సుందర్ పిచాయ్ (గూగుల్), శంతను నారాయణ్ (ఎడోబ్), వివేక్ లాల్ (జనరల్ ఆటమిక్స్), పునీత్ రంజన్ (డిలాయిట్), రాజ్ సుబ్రహ్మణ్యం (ఫెడెక్స్) తదితరులు ఉన్నారు.
- అధ్యక్షుడు బైడెన్‌కు ప్రసంగ రచయిత వినయ్ రెడ్డి, కొవిడ్ 19 కట్టడిపై ప్రధాన సలహాదారు డాక్టర్ ఆశిష్ ఝా, వాతావరణ విధాన సలహాదారు సోనియా అగర్వాల్, ఔషధ నియంత్రణ సంస్థ అధిపతి రాహుల్ గుప్తాతో పాటు మరెందరో భారతీయులు అమెరికా పాలనా యంత్రాంగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.