న్యూయార్క్లో విషాద ఘటన జరిగింది. ఇంటి సమీపంలో కారులో కూర్చున్న భారతి సంతతికి చెందిన ఓ వ్యక్తిని దుండుగుడు కాల్చి చంపాడు. బాధితుడ్ని సత్నామ్సింగ్గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేపడతున్నామని తెలిపారు.
ఇదీ జరిగింది.. న్యూయార్క్ రిచ్మండ్ హిల్లో నివాసం ఉంటున్న భారత సంతతి వ్యక్తి సత్నామ్సింగ్.. శనివారం కారులో షికారు చేద్దామనుకున్నాడు. తన దగ్గర కారు లేకపోవడం వల్ల స్నేహితుడి దగ్గర అడిగి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత.. తన ఇంటి ఆవరణలో కారు పార్క్ చేసి అందులో కూర్చున్నాడు. అంతలోనే మృత్యువు ఓ దుండగుడి రూపంలో వచ్చింది. కారులో కూర్చున్న సత్నామ్ సింగ్ను దుండగుడు కాల్చి చంపి పారిపోయాడు. కాసేపటికి గమనించిన స్థానికులు.. బాధితుడ్ని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి అప్పటికే అతడు మరణించినట్లు నిర్ధరించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.