Indian High Commissioner Gurdwara :స్కాట్లాండ్లోని గ్లాస్గోలో బ్రిటన్ భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామిని గురుద్వారాలోకి వెళ్లకుండా అడ్డుకున్న ఘటనను గ్లాస్గో గురుద్వారా తీవ్రంగా ఖండించింది. గురుద్వారా అన్ని మతాలు, నేపథ్యాల వారికి స్వాగతం పలుకుతుందని పేర్కొంది.
Glasgow Gurdwara Incident :'2023 సెప్టెంబర్ 29న భారత హైకమిషనర్ గ్లాస్గో గురుద్వారాలో వ్యక్తిగత పర్యటనలో ఉన్నారు. ఆయన వెంట స్కాటిష్ పార్లమెంట్ సభ్యుడు కూడా ఉన్నారు. గ్లాస్గో వెలుపలి నుంచి వచ్చిన కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు హైకమిషనర్ సందర్శనకు అంతరాయం కలిగించడానికి ప్రయత్నించారు. దీంతో హైకమిషనర్ అక్కడి నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నారు' అని గ్లాస్గో గురుద్వారా గురు గ్రంథ్ సాహిబ్ సిక్కు సభ తన ప్రకటనలో వివరించింది.
కొందరు 'వికృత వ్యక్తులు' ప్రార్థనా ప్రదేశానికి భంగం కలిగించారని.. ఈ విషయంపై స్కాట్లాండ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు గురద్వారా తెలిపింది. దీనిపై స్కాట్లాండ్ పోలీసులు స్పందించారు. ఈ ఘటన జరగడానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోందని తెలిపారు.
వ్యతిరేకించిన బ్రిటిష్ ఎంపీలు..
ఈ ఘటనను పలువురు బ్రిటీష్ ఎంపీలు కూడా ఖండించారు. ఈ విషయం తెలిసిన తర్వాత తాను ఆందోళనకు గురయ్యానని ఇండో-పసిఫిక్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి అన్నే మేరీ ట్రెవెల్యన్ చెప్పారు. ప్రార్థనా ప్రదేశాల భద్రత చాలా ముఖ్యమైనదని.. యూకేలో అలాంటి ప్రదేశాలు అందరికీ అందుబాటులో ఉండాలన్నారు.