Indian Army In Maldives :మాల్దీవుల నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు భారత్‌కు స్పష్టం చేశారు. మార్చి 15 నాటికి ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేయాలని తమ అధ్యక్షుడు చెప్పినట్లు మాల్దీవుల అధికారులు భారత హైకమిషనర్‌కు తెలిపారు. ఈ మేరకు ఇరు దేశాలు ఏర్పాటు చేసిన హై-లెవెల్ కోర్ గ్రూపు, ఆదివారం మాలేలోని విదేశాంగ శాఖ కార్యాలయంలో మొదటి సారి సమావేశమైంది. మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని వెనక్కి పిలిపించాలన్న అభ్యర్థనపై ఆ సమావేశంలో చర్చించారు.
'భారత్ ఇచ్చిన హెలికాప్టర్ల వినియోగం ఆపాలి'
భారత్‌తో చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలను కూడా సమీక్షించనున్నట్టు ఆ దేశ సమాచార వ్యవహారాల మంత్రి ఇబ్రహీం ఖలీల్ స్థానిక వార్తా పత్రికకు వెల్లడించారు. గతంలో మానవతా అవసరాల కోసం భారత్ ఇచ్చిన రెండు హెలికాప్టర్లను వినియోగించడం ఆపేయాలని అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు ఆదేశించినట్లు తెలిపారు. ప్రస్తుతం మాల్దీవుల్లో 88 మంది భారత సైనిక సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
ఈ సమావేశంపై భారత్ స్పందించింది. ఈ భేటీలో అనేక ద్వైపాక్షిక అంశాలపై చర్చించినట్లు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇరుపక్షాలు పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేశాయని చెప్పింది. ఇక భారత సైన్యం ఉపసంహరణను వేగవంతం చేయడానికి అంగీకరించాయని తెలిపింది. గతేడాది నవంబరులో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని ముయిజ్జు భారత్‌ను కోరారు.