భారతీయ-అమెరికన్ అంతరిక్ష రంగ నిపుణుడు ఏసీ చరానియా.. నాసా కొత్త చీఫ్ టెక్నాలజిస్ట్‌గా నియమితులయ్యారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రధాన కార్యాలయంలో అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్‌కు ప్రధాన సలహాదారునిగా చరానియా వ్యవహరించనున్నారు. నాసా చేపట్టే వేర్వేరు ప్రాజెక్టులపై తన సలహాలు ఇవ్వనున్నారు. నాసా చేపట్టే వేర్వేరు మిషన్లకు నిధుల సమీకరణ బాధ్యతల్నీ ఆయన చూడనున్నారు. సాంకేతికత కోసం అమెరికా ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు సంస్థలతో నాసా కలిసి పనిచేయడానికి సంబంధించిన వ్యవహారాల్నీ చరానియా పర్యవేక్షించనున్నారు.
ఏసీ చరానియా జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీని, ఎమోరీ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. నాసాలో చేరడానికి ముందు ఏరోస్పేస్ రంగానికి సంబంధించిన అనేక దిగ్గజ సంస్థల్లో కీలక బాధ్యతలు పోషించారు. వాటిలో కొన్ని..
- స్వయంప్రతిపత్త వాహనాల అభివృద్ధి చేసే సంస్థ అయిన రిలయబుల్ రోబోటిక్స్‌లో చరానియా పనిచేశారు.
- బ్లూ ఆరిజిన్ సంస్థకు కొంతకాలం సేవలు అందించారు. బ్లూ మూన్ లూనార్ ల్యాండర్ ప్రోగ్రామ్ సహా నాసాతో కలిసి చేపట్టిన మరికొన్ని కార్యక్రమాల్లో పనిచేశారు.
- చరానియా వర్జిన్ గెలాక్టిక్ (ఇప్పుడు వర్జిన్ ఆర్బిట్) లాంచర్‌వన్ ప్రాజెక్టులో కూడా పనిచేశారు.
ఇప్పటివరకు నాసా చీఫ్ టెక్నాలజిస్ట్‌గా పనిచేసిన భవ్య లాల్.. చరానియా నియామకాన్ని స్వాగతించారు. చరానియా అనుభవం.. నాసా అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.