తన కుమారుడికి విడాకులు ఇవ్వాలని భావించిన కోడల్ని వెతికి మరీ కాల్చి చంపాడో వృద్ధుడు. అమెరికాలోని ఓ మాల్ పార్కింగ్ లాట్‌లో కోడల్ని చంపిన కేసులో ఓ వృద్ధుడిని పోలీసులు అరెస్టు చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో రాష్ట్రంలో శాంజోస్‌లో వారం రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు గురుప్రీత్ కౌర్ దోసాంజ్ వాల్‌మార్ట్‌లో పనిచేస్తుండగా.. ఆమెను వెతుక్కుంటూ 150 మైళ్ల దూరం ప్రయాణించిన ఆ వృద్ధుడు తన కోడల్ని కాల్చి చంపినట్టు సమాచారం. అయితే, మృతురాలి మేనమామ ఇచ్చిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేసిన అక్కడి పోలీసు అధికారులు సీతల్ సింగ్ దోసాంజ్ (74)ను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు.
ఈ దారుణానికి ముందు గుర్‌ప్రీత్ తన మేనమామకు ఫోన్ చేసి మాట్లాడారు. అక్కడి పరిస్థితిని ఆయనకు చెబుతుండగానే ఆమె వైపు దూసుకొచ్చిన వృద్ధుడు గుర్‌ప్రీత్‌ను కాల్చి చంపినట్టు సమాచారం. సీతల్ తన కోసం వెతుకుతున్నాడని, భయంగా ఉందంటూ గుర్‌ప్రీత్ తన మేనమామకు ఫోన్‌లో చెప్పినట్టు దర్యాప్తు అధికారులు తమ నివేదికలో తెలిపారు. వాల్‌మార్ట్‌లో పని నుంచి విరామం తీసుకొని బయట తన కారు వద్దకు వచ్చిన ఆమె.. లాట్‌లో సీతల్ డ్రైవింగ్ చేస్తున్నట్టు చూశానని, తనను వెతుక్కుంటూ 150 మైళ్ల దూరం వచ్చాడని తన మేనమామకు వివరించింది. అయితే, తన కారు వద్ద ఉన్న గుర్‌ప్రీత్ వద్దకు దూసుకొస్తున్న సమయంలో ఆమె భయంతో గట్టిగా కేకలు వేసిందని ఆయన చెప్పినట్టు తెలిపారు. గుర్‌ప్రీత్ చివరి మాటలు అవేనని.. ఆ తర్వాత ఫోన్ డిస్‌కనెక్ట్ అయిపోయిందని పోలీసులు తమ దర్యాప్తు నివేదికలో పేర్కొన్నారు.