Spellingbee Harini Logan: అమెరికాలో ప్రతిష్టాత్మక జాతీయ స్పెల్లింగ్ బీ పోటీల్లో ఈ ఏడాది కూడా భారత సంతతికి చెందిన విద్యార్థుల ఆధిపత్యం కొనసాగింది. 2022 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతికి చెందిన 14 ఏళ్ల హరిణి లోగాన్ విజేతగా నిలిచింది. 21 పదాలకు స్పెల్లింగ్‌లను తప్పులేకుండా చెప్పిన హరిణి స్క్రిప్స్ కప్ ట్రోఫీ అందుకుంది. హరిణికి 50 వేల డాలర్ల ప్రైజ్ మనీ దక్కింది. టెక్సాస్‌కు చెందిన హరిణి 8వ గ్రేడ్ చదువుతోంది.
ఈ పోటీల్లో విక్రమ్ రాజుకు రెండో స్థానం దక్కింది. 90 సెకన్లలో హరిణి 26 పదాలకుగాను 21 పదాలకు సరైన స్పెల్లింగ్ చెప్పింది. 12 ఏళ్ల విక్రమ్ రాజు 19 పదాల్లో 15 పదాలకు సరైన స్పెల్లింగ్ చెప్పాడు. ఈ పోటీల్లో విహాన్ సిబల్‌కు 3వ స్థానం, ఉప్పల సహర్ష్‌కు నాలుగో స్థానం దక్కింది. 1925 నుంచి జాతీయ స్పెల్లింగ్ బీ పోటీలు నిర్వహిస్తున్నారు. అమెరికా జనాభాలో భారత సంతతి అమెరికన్లు ఒక్క శాతమే అయినప్పటికీ గత 20 ఏళ్లుగా స్పెల్లింగ్ బీ పోటీల్లో వారు ఆధిపత్యం కొనసాగిస్తున్నారు.