భారత సంతతి వ్యక్తి అజయ్ బంగాను ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి నామినేట్ చేస్తున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ప్రకటించారు. భారతీయ అమెరికన్ అయిన ఆయనకు.. ప్రపంచ బ్యాంకుకు నేతృత్వం వహించే నైపుణ్యాలు అన్నీ ఉన్నాయని కితాబిచ్చారు. చరిత్రలో అత్యంత కీలకమైన దశలో ప్రపంచబ్యాంకుకు సేవలు అందించే సత్తా ఉందని అన్నారు. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా ఎంపికైతే.. ఆ బాధ్యతలు చేపట్టిన తొలి భారతీయ అమెరికన్, తొలి సిక్కు అమెరికన్‌గా రికార్డుకెక్కుతారు.
భారతీయ అమెరికన్ చేతికి ప్రపంచ బ్యాంకు పగ్గాలు!... అజయ్‌ను నామినేట్ చేసిన బైడెన్ - జో బైడన్
భారత సంతతి వ్యక్తి వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు కాబోయో అవకాశాలు కనిపిస్తున్నాయి. సిక్కు-అమెరికన్ అయిన అజయ్ బంగాను.. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆ పదవికి నామినేట్ చేశారు.
"మూడు దశాబ్దాలుగా కంపెనీలను అభివృద్ధి చేస్తూ ఆయన విశేషంగా సేవలు అందించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారీగా పెట్టుబడులు వచ్చేలా ప్రయత్నించారు. ఉద్యోగ కల్పన విషయంలో గొప్పగా పనిచేశారు" అని బైడెన్ కొనియాడారు.
మరోవైపు, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సైతం అజయ్ బంగాపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచ బ్యాంకులో విప్లవాత్మక మార్పులకు నాంది పలికే అధ్యక్షుడిగా అజయ్ బంగా రికార్డుకెక్కుతారని కమల ఆశాభావం వ్యక్తం చేశారు. వాతావరణ మార్పులు వంటి ప్రపంచ స్థాయి సమస్యలను ఎదుర్కోవడంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనప్పటి నుంచి బంగాతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యంతో వలసలను తగ్గించేందుకు పరిష్కారం అందించే కొత్త విధానంపై కసరత్తు చేసినట్లు వివరించారు.
మాస్టర్ కార్డ్ సంస్థ మాజీ సీఈఓ అయిన బంగా(63) ప్రస్తుతం జనరల్ అట్లాంటిక్‌కు వైస్ ఛైర్మన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. వ్యూహాత్మక, సాంకేతిక, సాంస్కృతిక మార్పులు తీసుకురావడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2016లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.