India US news: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ సాగిస్తున్న నేపథ్యంలో ప్రపంచంలోని రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య కీలక చర్చలు జరిగాయి. భారత్, అమెరికా.. రక్షణ, విదేశాంగ మంత్రులు వివిధ అంశాలపై చర్చలు జరిపారు. అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులతో భేటీ అయిన భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్... ద్వైపాక్షిక, వాణిజ్య అంశాలతో పాటు ప్రపంచ పరిణామాలపై సమాలోచనలు జరిపారు. అనంతరం సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. భారత్‌తో సంబంధాలు అమెరికాకు చాలా ముఖ్యమని ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ స్పష్టం చేశారు.
"భారత్- రష్యా మధ్య దీర్ఘకాలంగా సంబంధాలు ఉన్నాయి. భారత్‌తో సంబంధాల విషయంలో అమెరికా తటస్థంగా ఉన్న సమయంలోనూ రష్యా- ఇండియా మధ్య సంబంధాలు కొనసాగాయి. కానీ, కాలం మారిపోయింది. ఇప్పుడు అమెరికా భారత్‌కు మెరుగైన భాగస్వామిగా, భారత్ కోరుకునే రక్షణ భాగస్వామిగా ఉండగలుగుతోంది.. ఇకపైనా ఉండేందుకు సిద్ధంగా ఉంది."
-ఆంటోనీ బ్లింకెన్
India US dialogue in Washington: ఈ సందర్భంగా రష్యాతో భారీ ఆయుధ లావాదేవీలు జరపొద్దని అన్ని దేశాలకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. రష్యా- భారత్ మధ్య ఎస్-400 డీల్‌పై స్పందించిన ఆయన.. కాట్సా చట్టం ప్రకారం ఆంక్షలు విధించే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. మరోవైపు, ఉక్రెయిన్‌కు భారత్ చేస్తున్న సాయం గురించి ప్రస్తావించారు బ్లింకెన్. ప్రపంచ మార్కెట్‌కు మరిన్ని ఆహార పదార్థాలు అందించడం, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్‌కు సాయం అందించే విషయంలో ఇరుదేశాలు కలిసి సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.
అమెరికా- భారత్ సంబంధాలు ద్వైపాక్షికానికి మించి...:అమెరికా మంత్రులతో ఉక్రెయిన్‌లో యుద్ధం, అఫ్గాన్ పరిణామాలు, ఇండో పసిఫిక్ ప్రాంతంలో పరిస్థితులతో పాటు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో భారత్-అమెరికా మధ్య సహకారం ప్రపంచవ్యాప్తంగా స్పష్టంగా తెలిసిందని అన్నారు. ఇరుదేశాల మధ్య భాగస్వామ్యం.. ద్వైపాక్షిక స్థాయిని దాటిందని చెప్పారు. అమెరికా- భారత్ సహకరించుకోని రంగంమంటూ లేదని తెలిపారు. ఈ సందర్భంగా రష్యా నుంచి చమురు కొనుగోలు అంశంపై సంయుక్త మీడియా సమావేశంలో ఓ విలేకరి ప్రశ్నించగా.. విదేశాంగ మంత్రి జైశంకర్ గట్టిగా బదులిచ్చారు. భారత్ దిగుమతి చేసుకునే చమురు చాలా తక్కువేనని స్పష్టం చేశారు.
"యుద్ధం మొదలైనప్పటి నుంచి మా వైఖరి స్పష్టం చేస్తూనే ఉన్నాం. చర్చలు, దౌత్య మార్గాల్లో సమస్య పరిష్కారానికి పిలుపునిస్తున్నాం. మేం ఘర్షణకు వ్యతిరేకం. భారత్ ఇంధన కొనుగోళ్లపై మీరు ప్రశ్నిస్తే మీకు నేను చెప్పేది ఒక్కటే. మీరు ముందుగా ఐరోపాపై దృష్టిసారించాలి. మా ఇంధన అవసరాల కోసం మేం చమురు కొనుగోలు చేస్తున్నాం. గణాంకాలను పరిశీలిస్తే.. మేం నెల రోజుల పాటు కొనే ఇంధనం.. ఐరోపా దేశాలు ఒకరోజు మధ్యాహ్నానికి కొనే మొత్తానికి సమానం."
-జైశంకర్, భారత విదేశాంగ మంత్రి