India Suspends Visa Services in Canada :ఖలిస్థానీ నేత హత్య విషయంలో కెనడాతో దౌత్యపరమైన ఉద్రిక్తత కొనసాగుతున్న వేళ అక్కడి వీసా సేవలను భారత్ నిలిపివేసింది. తదుపరి నోటీసులు వచ్చేవరకు కెనడాలో వీసా సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కెనడాతో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలోనే.. ఆ దేశ పౌరులకు వీసా సేవలను నిలిపివేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కెనడా ప్రజల వీసా అప్లికేషన్లను పరిశీలించే ప్రైవేటు ఏజెన్సీ బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ సైతం.. ఇందుకు సంబంధించి తన వెబ్సైట్లో నోట్ ఉంచింది. భారత వీసా సేవలు తదుపరి నోటీసుల వరకు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. కొద్దిసేపటికే ఆ సందేశం బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ వెబ్సైట్ నుంచి మాయం కాగా.. నిమిషాల్లోనే మళ్లీ ప్రత్యక్షమైంది.
India Canada Visa Suspension :ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ అధినేత అయిన హర్దీప్ సింగ్ నిజ్జర్ ఈ ఏడాది జూన్‌లో కెనడాలో హత్యకు గురయ్యాడు. ఈ ఘటన భారత్-కెనడా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. హత్యలో భారత ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేయడం సంచలనమైంది. అంతేకాకుండా, కెనడాలో పనిచేస్తున్న భారత అధికారిని బహిష్కరించడం వివాదానికి ఆజ్యం పోసినట్లైంది. అయితే, భారత్ సైతం కెనడాకు దీటుగా బదులిస్తోంది. కెనడా ఆరోపణలను కొట్టిపారేస్తూ.. ఆ దేశానికి చెందిన రాయబారిని భారత్ నుంచి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. అదేసమయంలో కెనడాలో ఉన్న భారతీయులకు కీలక సూచనలు చేసింది. కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో పౌరులు ఎక్కడికి వెళ్లినా జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది. కెనడాలో విద్వేషనేరాలు, హింస పెరుగుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ భారత పౌరులకు హెచ్చరికలు చేసింది.
Canada PM Trudeau Statement : కెనడా కయ్యం.. రెచ్చగొట్టం అంటూనే కశ్మీర్‌పై ట్రావెల్ అడ్వైజరీ.. అమెరికా ఆందోళన
'హిందువులకు రక్షణ కల్పించండి'
కెనడాలో హిందువులకు రక్షణకు కల్పించాలని కోరుతూ ఆ దేశ ప్రజా భద్రతా మంత్రి డామినిక్ లెబ్లాంక్కు 'హిందూ ఫోరం కెనడా' అనే సంస్థ లేఖ రాసింది. ఖలిస్థానీల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత సిక్ ఫర్ జస్టిస్ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్ను ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు ఆందోళనకరంగా ఉన్నాయని పేర్కొంది. "ఈ విషయంపై కెనడా అధికారులు తీవ్రంగా స్పందించాలని కోరుతున్నాం. ఇది కెనడా పౌరుల భద్రతపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది" అని పేర్కొంది.
'ఆరోపణలు తీవ్రమైనవి.. అమెరికాకు భారతే ముఖ్యం!'
మరోవైపు, జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు తీవ్రమైనవని, ఈ అంశంపై భారత్, కెనడాతో సంప్రదింపులు జరుపుతున్నామని అమెరికా విదేశాంగ శాఖకు చెందిన హిందుస్థానీ ప్రతినిధి మార్గరెట్ మెక్లాయెడ్ పేర్కొన్నారు. భారత్-అమెరికా మధ్య సత్సంబంధాలు అత్యంత కీలకమని పేర్కొన్న మార్గరెట్.. ఏఐ, స్పేస్, సైన్స్, టెక్నాలజీ రంగాల్లో ఇరుదేశాల మధ్య సహకారం భవిష్యత్‌లోనూ కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కెనడా హైకమిషన్ ప్రకటన
ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌లోని కెనడా హైకమిషన్ కీలక ప్రకటన చేసింది. భారత్‌లో ఉన్న హైకమిషన్, కాన్సులేట్ కార్యాలయాలన్నీ సజావుగానే పనిచేస్తున్నట్లు తెలిపింది. ఇటీవలి ఉద్రిక్తతల నేపథ్యంలో తమ దౌత్యవేత్తల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. 'కొందరు దౌత్యవేత్తలకు వివిధ సామాజిక మాధ్యమాల్లో బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో పనిచేసే సిబ్బందిని తాత్కాలికంగా తగ్గించుకోవాలని చూస్తున్నాం. గుర్తింపు ఉన్న మా దౌత్యవేత్తలకు, అధికారులకు భారత్.. తగిన భద్రత కల్పిస్తుందని భావిస్తున్నాం' అని పేర్కొంది.
Canada India Relationship : భారత్-కెనడా విభేదాలకు కారణం ప్రధానే! రాజకీయ బలహీనత వల్లే ఇలా..