Yuan wang 5 ship: పొరుగు దేశాలతో కయ్యానికి కాలుదువ్వే చైనా మరో దుందుడుకు చర్యకు ఉపక్రమిస్తోందా? ఈ ప్రశ్నకు రక్షణ రంగ నిపుణుల నుంచి 'అవును' అనే సమాధానం వినిపిస్తోంది. డ్రాగన్ దేశానికి చెందిన నిఘా నౌక 'యువాన్ వాంగ్ 5' గంటకు 35.2 కిలోమీటర్ల వేగంతో శ్రీలంకలోని హంబన్‌టొట నౌకాశ్రయానికి వెళుతున్నట్లు కథనాలు వెలువడడమే ఇందుకు కారణం. ఈ నెల 11 నుంచి 17 వరకు 'యువాన్ వాంగ్ 5' హంబన్‌టొట వద్ద ఉంటుందని శ్రీలంక రక్షణ మంత్రిత్వశాఖ ఇప్పటికే ధ్రువీకరించింది కూడా.
భారత్ ఆందోళన ఎందుకంటే..
'యువాన్ వాంగ్ 5' క్షిపణి, అంతరిక్షం, ఉపగ్రహాల ట్రాకింగ్ చేయగలదు. 750 కిలోమీటర్లకుపైగా దూరంలోని ప్రాంతాలపై గగనతల నిఘా ఉంచగలదు. ఫలితంగా కల్పకం, కూడంకుళం సహా అణు పరిశోధన కేంద్రాలు దీని పరిధిలోకి వస్తాయి. దీంతోపాటు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆరు భారతీయ పోర్టులపై ఈ నౌక నిఘా నేత్రం ఉంచగలదు. దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన సంస్థల కీలక సమాచారాన్నీ సేకరించగలదు.
అందుకే హంబన్‌టొటలో..
శ్రీలంకలో చాన్నాళ్లుగా అధికారంలో ఉంటూ ఇటీవలే పదవీచ్యుతులైన రాజపక్స కుటుంబం సొంత నగరం హంబన్‌టొట. ఇక్కడి నౌకాశ్రయాన్ని చైనా నుంచి భారీగా రుణాలు తీసుకుని నిర్మించారు. వ్యూహాత్మక ప్రాంతంలో ఉండడం వల్ల ఈ పోర్టు అత్యంత కీలకమైనదిగా చెబుతుంటారు. మరోవైపు, ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న శ్రీలంక.. చైనా నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలమైంది. దీంతో హంబన్‌బొట నౌకాశ్రయాన్ని చైనా మర్చంట్ పోర్ట్ హోల్డింగ్స్‌కు లీజుకు ఇచ్చింది. దీంతో డ్రాగన్ దేశం ఈ పోర్టును సైనిక అవసరాల కోసం వినియోగించుకునే అవకాశముందనే ఆందోళనలు మొదలయ్యాయి. 2014లో కొలంబో పోర్టులో ఉంచిన చైనా జలాంతర్గామి కంటే.. ఈ నౌక మరింత శక్తిమంతమైనదిగా చెబుతున్నారు.