Modi Egypt Visit : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన పురస్కారం లభించింది. ఈజిప్ట్ పర్యటనలో ఉన్న ఆయన్ను.. ఆ దేశ అత్యున్నత 'ఆర్డర్ ఆఫ్ ద నైల్' అవార్డు వరించింది. దీనిని ఆ దేశ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసి.. మోదీకి ప్రదానం చేశారు. ఇప్పటికే 12 దేశాల అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు మోదీ. అవార్డు ప్రదానానికి ముందు అధ్యక్షుడు సిసితో ఇరుదేశాల సంబంధాల బలోపేతంపై చర్చించారు మోదీ. పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. మరోవైపు ఇరు దేశాల మధ్య సంబంధాలపై ఈజిప్ట్ ప్రధాని ముస్తాఫా మద్బౌలితో చర్చించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. వ్యాపార, ఆర్థిక, వాణిజ్యం, పెట్టుబడులు, పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, ఐటీ, డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థ, ఫార్మా తదితర రంగాలలో సహకారాన్ని మరింత మెరుగుపరచుకోవడంపై చర్చలు జరిపారు.
భారతీయ సైనికులకు మోదీ నివాళులు
Modi Egypt Cemetery : అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఈజిప్టు, పాలస్తీనాలో ఉండి పోరాడి మరణించిన భారతీయ సైనికులకు నివాళులు ఆర్పించారు. కైరోలోని హెలియోపొలిస్ కామన్‌వెల్త్ వార్ గ్రేవ్ సిమెట్రీని సందర్శించిన మోదీ.. అక్కడి స్మారకం వద్ద పుష్పాలు సమర్పించి అమరులైన భారత జవాన్లకు నివాళులర్పించారు. అనంతరం అక్కడ సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు.
మొదటి ప్రపంచ యుద్ధంలో దాదాపు 4,000 మంది భారత సైనికులు ఈజిప్టు, పాలస్తీనాలో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు.
పురాతన మసీదు సందర్శన
AL Hakim Mosque Modi : మరోవైపు కైరోలో అతి పురాతన అల్ హకీమ్ మసీదునూ సందర్శించారు ప్రధాని మోదీ. 11వ శతాబ్దానికి చెందిన మసీదు చారిత్రక, సాంస్కృతిక ప్రదేశంగా ఎంతో ప్రఖ్యాతి గాంచింది. 1012వ సంవత్సరంలో దీన్ని నిర్మించారు. 13,560 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ మసీదు విస్తరించి ఉంది. భారత్‌కు చెందిన దావూదీ బోహ్రా సంఘం సహాయంతో ఈ మసీదును పునరుద్ధరించారు. 1997 తర్వాత భారత ప్రధాని ఒకరు ఈజిప్టులో పర్యటించడం ఇదే తొలిసారి. ప్రధానిగా నరేంద్ర మోదీకి ఇది తొలి ఈజిప్టు పర్యటన.
"ఇది మాకు మరిచిపోలేని రోజు. ప్రధాని మోదీ.. మసీదుకు వచ్చి మాతో మాట్లాడారు. మా బోరా సంఘం బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు."