పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత గురించి ధనిక దేశాలు చెబుతున్న మాటలకు వాటి ఆచరణకు ఏ మాత్రం పొంతనలేదని మరోసారి రుజువైంది. భూతాపానికి కారణమవుతున్న కర్బన ఉద్గారాల(గ్రీన్‌హౌస్ గ్యాస్) విడుదల ఆ దేశాల్లోనే అత్యధికంగా ఉంటోందని ఐక్యరాజ్యసమితి(ఐరాస) పర్యావరణ కార్యక్రమ నివేదిక స్పష్టం చేసింది. 2020లో కర్బన ఉద్గారాల ప్రపంచ తలసరి 6.3 టన్నులు(కార్బన్ డైఆక్సైడ్ ఈక్వలెంట్)కాగా భారత్ సగటు 2.4 టన్నులు మాత్రమేనని వెల్లడించింది. జీ20 దేశాల సగటులోనూ భారత్‌లో కర్బన ఉద్గారాల విడుదల సగమేనని ఐరాస నివేదిక పేర్కొంది.
వచ్చే నెలలో ఈజిప్టులో జరగబోతున్న ఐరాస పర్యావరణ సదస్సు(కాప్27)ను పురస్కరించుకుని 'ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ 2022: క్లోజింగ్ విండో' పేరుతో గురువారం ఓ నివేదిక విడుదలైంది. భూతాపాన్ని గణనీయంగా తగ్గించుకోవాలన్న ఉమ్మడి లక్ష్యంతో ప్రపంచ దేశాలు 2015లో పారిస్ ఒప్పందంపై అవగాహనకు వచ్చాయి. ఈ శతాబ్దం చివరికి భూతాపంలో పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్ కన్నా మరింత తగ్గించుకోవాలని ప్రతినబూనాయి. పారిశ్రామికయుగానికి ముందునాటితో పోలిస్తే ఈ పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయడానికి ప్రయత్నించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.