India Nordic Summit 2022: పరస్పర సహకారంతో కలిసికట్టుగా కృషి చేయడం ద్వారా ప్రపంచ సుసంపన్నత్వానికి, సుస్థిరాభివృద్ధి సాధనకు తోడ్పాటునందించగలమని నార్డిక్ దేశాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగెన్‌లో బుధవారం నిర్వహించిన ఇండియా-నార్డిక్ రెండో శిఖరాగ్ర సదస్సులో ఆయన ప్రసంగించారు. ఆధునిక సాంకేతికతలు, శుద్ధ ఇంధనం, పెట్టుబడులు, ఆర్కిటిక్‌లో పరిశోధనలు తదితర అంశాల్లో బహుముఖమైన సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్దామని సూచించారు. ఈ సదస్సులో డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్‌లాండ్, నార్వే, స్వీడన్ దేశాల ప్రధాన మంత్రులు పాల్గొన్నారు. కరోనా తదనంతర పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థల పునరుత్తేజం, వాతావరణ మార్పులు, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాలపై సదస్సు ప్రధానంగా దృష్టి సారించింది. ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై నేతలు చర్చించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది.
అనంతరం విడుదలైన సంయుక్త ప్రకటనలో ఉక్రెయిన్‌లో నెలకొన్న సంక్షోభంపై నేతలందరూ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ వాణిజ్య సంస్థలలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. శిఖరాగ్ర సదస్సు ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ నార్డిక్ దేశాల ప్రధాన మంత్రులతో విడివిడిగా సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై విస్తృత సంప్రదింపులు జరిగాయి.
- ఐరోపా పర్యటనలో భాగంగా మూడో రోజైన బుధవారం ప్రధాని మోదీ కోపెన్‌హాగెన్‌లో నార్డిక్ దేశాల నేతలతో చర్చలు జరిపారు. తొలుత నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టారెతో భేటీ అయ్యారు. "సముద్ర వాతావరణ ఆధారిత ఆర్థిక వ్యవస్థ, శుద్ధ ఇంధనం, అంతరిక్ష పరిశోధనలు, ఆరోగ్య సంరక్షణ తదితర రంగాల్లో ఇరు దేశాల సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై ఫలవంతమైన చర్చలు జరిగాయి. భారత ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఆర్కిటిక్ విధానం అమలులో నార్వే కీలక భాగస్వామిగా ఉంద"ని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
- స్వీడన్ ప్రధాని మగ్దలెనా ఆండర్సోన్‌తో భేటీలో... రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, సమాచార సాంకేతికతలు, నవోన్వేషణలు తదితర రంగాల్లో రెండు దేశాల సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడంపై చర్చించినట్లు ప్రధాని మోదీ ట్వీట్ ద్వారా వెల్లడించారు.
- ఐస్‌లాండ్ ప్రధాని కత్రిన్ జాకబ్స్‌దతిర్‌తో జియోథర్మల్ ఎనర్జీ, ఆర్థిక సహకారం, సముద్ర వాతావరణ ఆధారిత ఆర్థిక వ్యవస్థ, మృత్స్యపరిశ్రమ, ఆహారశుద్ధి, విద్య, డిజిటల్ విశ్వవిద్యాలయాలపై మోదీ చర్చించారు. భారత్-ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంస్థ(ఈఎఫ్‌టీఏ) సంప్రదింపులను వేగవంతం చేయడంపైనా నేతలిద్దరూ మాట్లాడుకున్నారు.
- ఫిన్లాండ్ ప్రధాని సనా మారున్‌తో జరిగిన సంప్రదింపుల్లో డిజిటల్ భాగస్వామ్యం, పెట్టుబడుల అనుసంధానత, వాణిజ్య భాగస్వామ్యం, రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాల బలోపేతం వంటి అంశాలు ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చాయి. టెలికం మౌలిక సదుపాయాలు, డిజిటల్ రూపాంతరీకరణ తదితర రంగాల్లో భారత కంపెనీలతో జట్టు కట్టాల్సిందిగా ఫిన్లాండ్ కంపెనీలను ప్రధాని మోదీ ఆహ్వానించారు.
భారతీయతకు అద్దంపట్టిన బహుమతులు:నార్డిక్ దేశాల నేతలతో భేటీ సందర్భంగా ప్రధాన మంత్రి మోదీ వారికి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే పలు రకాల బహుమతులను అందజేశారు. వాటిలో గుజరాత్‌లోని కచ్‌లో కళాకారుల హస్త నైపుణ్యాన్ని చాటే వస్త్రంపై వేసిన పెయింటింగ్, బెనారస్‌లో తయారైన వెండి మీనాకారి పక్షి, రాజస్థాన్ కళాకారులు తయారు చేసిన ఇత్తడి వృక్షం తదితరాలు ఉన్నాయి.