India Help Palestine :ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య నెలకొన్న యుద్ధం కారణంగా పెద్దఎత్తున నష్టపోయిన పాలస్తీనా వాసులను ఆదుకునేందుకు భారత్ ముందుకొచ్చింది. ఆ దేశానికి మానవతా సాయం కింద తక్షణమే 38.5 టన్నుల వైద్య, విపత్తు సహాయ సామగ్రిని పంపించింది. ఇందులో 6.5 టన్నుల వైద్యానికి సంబంధించిన వస్తువులు, 32 టన్నుల విపత్తు సహాయ సామగ్రి ఉందని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఆదివారం వెల్లడించారు.
ఈ వైద్య సామగ్రిలో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే మందులతో పాటు పెయిన్‌కిల్లర్స్, ఫ్లుయిడ్స్, ఇతర ఔషధాలు, శస్త్రచికిత్సలకు కావాల్సిన పరికరాలు ఉన్నాయని బాగ్చీ తెలిపారు. అలాగే విపత్తు నివారణ కోసం అవసరమైన సామగ్రిలో టెంట్లు, స్లీపింగ్ బ్యాగులు, టార్పాలిన్‌లు, ప్రాథమికంగా ఉపయోగపడే శానిటరీ వస్తువులు, నీటి శుద్ధీకరణ మాత్రలతో పాటు ఇతర వస్తువులు ఉన్నాయి. వీటన్నింటిని తీసుకొని భారత వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానం C17.. పాలస్తీనాకు బయలుదేరిందని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు.
"ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన పాలస్తీనా ప్రజలను ఆదుకునేందుకు భారత్ సిద్ధమైంది. మానవతా సాయం కింద ఆ దేశానికి 38.5 టన్నుల ఔషధాలు, వైద్య పరికరాలను పంపించింది. వీటితో పాటు విపత్తు నివారణకు ఉపయోగపడే సామగ్రితో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన C17 ప్రత్యేక విమానం ఇప్పటికే ఆ దేశానికి బయలుదేరింది."
- అరిందమ్ బాగ్చీ, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి
India Aid To Palestine :సహాయ సామగ్రితో కూడిన C17 ఎయిర్‌క్రాఫ్ట్ ఆదివారం ఉదయం 8 గంటలకు హిండన్ ఎయిర్‌బేస్ నుంచి బయలుదేరింది. ఈ విమానం ఈజిప్ట్‌లోని ఎల్-అరీష్ ఎయిర్‌పోర్ట్‌కు మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి రఫా సరిహద్దు గుండా యుద్ధ ప్రభావిత ప్రాంతమైన గాజాకు వీటిని తీసుకెళ్తారని విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. మరోవైపు మానవతా సాయం కింద ఇతర దేశాల నుంచి కూడా గాజాకు వైద్య సహాయం అందుతున్నప్పటికీ.. గాజాలో రహదారులన్నీ తీవ్రంగా ధ్వంసం కావడం వల్ల అవి వేగంగా పాలస్తీనా పౌరులకు చేరడం లేదని తెలుస్తోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ హెచ్చరిక..
అమెరికా, ఐరాస సహా పలు దేశాలు ఒత్తిడితో ఎట్టకేలకు శనివారం ఈజిప్ట్ సరిహద్దు రఫా ద్వారా గాజాలోకి మానవతా సాయాన్ని తరలించేందుకు 20 ట్రక్కులను ఇజ్రాయెల్ అధికారులు గాజాలోకి అనుమతించారు. అయితే 2 మిలియన్లకుపైగా జనాభా ఉన్న ఎన్‌క్లేవ్‌లో అవసరాలు చాలా ఎక్కువని.. ప్రస్తుతం అందుతున్న సాయం ఏ మాత్రం సరిపోదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్-జనరల్ టెడ్రోస్ అథనామ్ హెచ్చరించారు. మరోవైపు గాజాలో ప్రస్తుతం 60 శాతానికిపైగా సౌకర్యాలు మూతపడ్డాయి. అలాగే గాజాలోని ఆస్పత్రులు పతనం అంచున అన్నాయని.. ప్రధానంగా విద్యుత్, ఔషధాలు, వైద్య పరికరాలు సహా ప్రత్యేక సిబ్బంది కొరత కూడా ఇక్కడ అధికంగా ఉందని ఐక్యరాజ్య సమితి నొక్కిచెప్పింది.