India G20 summit: 2023లో నిర్వహించనున్న జీ20 శిఖరాగ్ర సదస్సు అధ్యక్ష బాధ్యతలను భారత్ స్వీకరించింది. వచ్చే ఏడాది జరిగే సమావేశాలకు భారత్ నేతృత్వం వహించనుంది. ఈ మేరకు ప్రస్తుత జీ20 సమావేశాల ముగింపు కార్యక్రమంలో ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడొడో.. సదస్సు బాధ్యతలను భారత్కు అప్పగించారు. అధికారికంగా డిసెంబర్ 1 నుంచి జీ20 అధ్యక్ష బాధ్యతలు భారత్ చేపట్టనుంది.
ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే నినాదంతో.. వసుధైక కుటుంబం అనే భావనతో 2023లో జీ20 సదస్సును నిర్వహిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. జీ20 అధ్యక్ష పదవిని చేపట్టడం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్న మోదీ.. దేశంలోని వివిధ నగరాల్లో సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. జీ20 సదస్సును ప్రపంచ మార్పునకు ఉత్ప్రేరకంగా మారుస్తామని ప్రధాని వెల్లడించారు.
ఇప్పటికే జీ20 సదస్సుకు సంబంధించిన పనులు ప్రారంభించింది భారత్. వచ్చే ఏడాది నిర్వహించనున్న సమావేశాల కోసం వెబ్సైట్, లోగోను ఆవిష్కరించింది.