India Cautions Students On Canada :భారత్-కెనడా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయ పౌరులకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కెనడాలోని భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారతీయులు, భారతీయ సంస్థలపై కెనడాలో దాడులు జరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో కెనడాలోని భారతీయ విద్యార్థులు, పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు, రాజకీయ అండతో జరుగుతున్న విద్వేషపూరిత నేరాలు పెరుగుతుండటం వల్ల భారతీయులు తమ ప్రయాణాల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇండియా వ్యతిరేక అజెండాను వ్యతిరేకిస్తున్న భారత కమ్యూనిటీ ప్రజలను, దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల కాలంలో బెదిరింపులు వస్తున్నాయని తెలిపింది. అందువల్ల అలాంటి హింసాత్మక ఘటనలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లొద్దని కోరింది. కెనడాలో భారతీయులు, భారతీయ సంస్థలపై దాడులు జరిగే అవకాశం కూడా ఉందని పేర్కొంది.
India Canada Tensions : కెనడాలోని భారత పౌరులను సంరక్షించేందుకు అక్కడి అధికారులతో భారత హైకమిషన్, కాన్సులేట్ జనరల్ నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉందని విదేశాంగ శాఖ తెలిపింది. ప్రస్తుతం భద్రతాపరంగా అక్కడ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న నేపథ్యంలో.. పౌరులు, ముఖ్యంగా విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఒట్టావాలోని హైకమిషన్ లేదా టొరంటో, వాంకోవర్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా వద్ద భారతీయులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది. దీంతో అవాంఛనీయ సంఘటనలు జరిగినపుడు వేగంగా సంప్రదించేందుకు వీలవుతుందని విదేశాంగ శాఖ తమ అడ్వైజరీలో పేర్కొంది. కెనడాకు వెళ్లాలనుకునే భారతీయులు తమ ప్రయాణం గురించి పునరాలోచించుకోవాలని సూచించింది.
కెనడా సింగర్ టూర్ రద్దు
మరోవైపు కెనడా సింగర్ శుభనీత్ సింగ్ ఇండియా టూర్ 'స్టిల్ రోలిన్'ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ఆన్లైన్ టికెటింగ్ సైట్ బుక్ మై షో. ఈ షో కోసం టికెట్లు బుక్ చేసుకున్న వారందరికి 7-10 రోజుల్లో డబ్బులు రీఫండ్ చేస్తామని సంస్థ వెల్లడించింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కెనడా సింగర్ పర్యటనపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. దీంతో బుక్ మై షో సంస్థ.. ఆయన కార్యక్రమాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.