India Canada Row :ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో కెనడాకు అమెరికా కీలక సమాచారాన్ని చేరవేసిందని కెనడాలోని అమెరికా రాయబారి డేవిడ్ కోహెన్ చెప్పారు. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ సమాచారంతోనే భారత్‌పై కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలు చేశారని పేర్కొంది. 'ఫైవ్ ఐయ్స్' దేశాల మధ్య జరిగిన నిఘా సమాచార మార్పిడి.. ట్రూడోను భారత్‌పై ఆరోపణలు చేయడానికి ప్రేరేపించిందని పేర్కొంది. ఏ రకమైన సమాచారాన్ని కెనడాతో పంచుకున్నారో కోహెన్ చెప్పలేదు. అయితే కెనడా చేస్తున్న ఆరోపణలు నిజమైతే.. అంతర్జాతీయ నిబంధనలను భారత్ తీవ్రంగా ఉల్లంఘించినట్లే అవుతుందన్నారు కోహెన్. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, అమెరికా, యూకేలు భాగస్వాములుగా 1946లో ఫైవ్ ఐయ్స్‌ను స్థాపించారు.
Canada Khalistan Killing : అదే సమయంలో కెనడాలోని ఖలిస్థానీలను అమెరికా దర్యాప్తు సంస్థ(FBI) సైతం అప్రమత్తం చేసింది. ఏ క్షణమైన మృత్యువు ముంచుకొస్తుందని కెనడాలోని ఖలిస్థానీలను హెచ్చరించినట్లు ఇన్వెస్టిగేటివ్ పత్రిక ఇంటర్‌సెప్ట్ కథనం ప్రచురించింది. ఈ ఏడాది జూన్‌లో ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ అధినేత నిజ్జర్ కెనడాలోని సర్రేలో హత్యకు గురయ్యారు. ఈ ఘటన తర్వాత తనతో సహా కాలిఫోర్నియాలోని ఇద్దరు సిక్కు నేతలకు FBI నుంచి ఫోన్లు వచ్చాయని అమెరికన్ సిక్కు కాకసస్ కమిటీ సమన్వయ కర్త ప్రీత్‌పాల్ ఇంటర్‌సెప్ట్‌కు వెల్లడించారు. కొందరి వద్దకు అధికారులు నేరుగా వెళ్లి కలిసినట్లు సమాచారం. నిజ్జర్ హత్యకు ముందే తనకు ప్రాణహాని ఉందని కెనడా ఇంటెలిజెన్స్ బృందాలు హెచ్చరించినట్లు బ్రిటిష్ కొలంబియా గురుద్వారా కౌన్సిల్ ప్రతినిధి మహిందర్ సింగ్ వెల్లడించారు.
భారత్ వైపే అమెరికా మొగ్గు
భారత్, కెనడామధ్య నెలకొన్న వివాదాన్ని ఇప్పుడు ప్రపంచదేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. అంతర్జాతీయ వేదికలపై కీలక పాత్ర పోషిస్తూ ప్రపంచ ఆర్థిక వృద్ధికి బలమైన తోడ్పాటునందిస్తున్న భారత్ ఓవైపు.. సంపన్న దేశాల కూటమి జీ7లోని కెనడా మరోవైపు ఉండడం వల్ల ఆయా దేశాలు ఈ విషయంపై ఆచితూచి స్పందిస్తున్నాయి. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా ఎటువైపు మొగ్గుతుంది అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు ఎన్నికల సమయంలో నిధులు సమకూర్చిన చార్లెస్ మైయర్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, కెనడా వివాదంలో వీలైనంత వరకు అమెరికా తలదూర్చే అవకాశం లేదని చార్లెస్ మైయర్స్ తెలిపారు. ప్రధాని మోదీ హయాంలో భారత్‌తో బలమైన సంబంధాలను నిర్మించుకోవడంలో అమెరికా ఎంతో పురోగతి సాధించిందని పేర్కొన్నారు. తాజా వివాదంలో తలదూర్చి అగ్రరాజ్యం దాన్ని పాడు చేసుకునే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. పైగా చైనా ఆగడాలను అడ్డుకునే విషయంలో భారత్‌తో అమెరికా చాలా లోతైన సంబంధాలను కొనసాగిస్తోందని వివరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజా వివాదం నుంచి అమెరికా దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.