India Canada Row :ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య దర్యాప్తులో కెనడాకు సహకరించాలని భారత్‌కు అమెరికా విజ్ఞప్తి చేసింది. నిజ్జర్ హత్యలో భారత్ ఏజెంట్ల హస్తం ఉందన్న కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలపై తీవ్ర ఆందోళన చెందుతున్నామని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. ఈ అంశంపై కెనడాతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు.
'ఆ రెండు ప్రక్రియలు సంక్లిష్టమైనవి'
India Canada Issue America : ఈ కేసులో కెనడా చేస్తున్న విచారణతో పాటు నేరస్థులను న్యాయస్థానం ముందుకు తీసుకురావడం అనే రెండు ప్రక్రియలు సంక్లిష్టమైనవని అమెరికా భావిస్తోందని చెప్పారు. కేసు దర్యాప్తులో కెనడాకు సహకరించాలని బహిరంగంగానూ, ప్రైవేట్‌గానూ భారత ప్రభుత్వాన్ని తాము కోరుతున్నామని వివరించారు.
భారత్‌కు శ్రీలంక మద్దతు..
India Canada News : మరోవైపు, ఈ వివాదంపై భారత్‌కు శ్రీలంక మద్దతు పలికింది. కెనడా ఆరోపణలకు భారత్ దృఢంగా, ప్రత్యక్షంగా ప్రతిస్పందించిందని తెలిపింది. తమ దేశం ఏళ్ల తరబడి ఉగ్రవాదంతో ఎంతో నష్టపోయిందని.. అందుకే ఈ విషయంలో న్యూదిల్లీకే మద్దతు ఇస్తామని భారత్‌లోని శ్రీలంకా హైకమిషనర్ చెప్పారు.
కెనెడియన్లకు హెచ్చరికలు జారీ!
India Canada Issue : భారత్‌లో పర్యటించే కెనెడియన్లకు కెనడా.. మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. భారత్‌లో సామాజిక మాధ్యమాల ద్వారా కెనడా పట్ల వ్యతిరేకత పెరుగుతోందని చెప్పింది. అందుకే అక్కడ పర్యటించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆ దేశ పౌరులకు హెచ్చరించింది.
'హిందువులకు బెదిరింపులు.. ఆలయాలపైనా దాడులు'
India Canada Tensions :కెనడాలో ఖలిస్థాన్ సానుభూతి పరుల అరాచకాలు గత కొంత కాలంగా భారీగా పెరిగాయని భారత ప్రభుత్వంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. "ఈ అరాచకవాదులు.. బహిరంగంగానే కెనడాలోని మైనారిటీ హిందువులను బెదిరిస్తున్నారు. ఆలయాలపై దాడులు చేస్తున్నారు. మన దేశ దౌత్యవేత్తల భద్రతకు ముప్పుగా పరిణమించారు. పంజాబ్‌లో ఏ చిన్న విషయం జరిగినా కెనడా నుంచి తీవ్రంగా స్పందిస్తున్నారు. వీరిలో చాలా మంది మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో చురుగ్గా ఉన్నారు. అయినా అక్కడి అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇది రెండు దేశాల సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది" అని ఆ అధికారి పేర్కొన్నారు.