తెలంగాణ

telangana

ETV Bharat / international

India Canada Dispute: భారత్‌తో ఉద్రిక్తతల వేళ కెనడా మంత్రి కీలక వ్యాఖ్యలు.. 'ఆరోపణలు నిజమని తేలితే..' - canada india trade agreement

India Canada Dispute : భారత్‌తో బంధం తమకు ముఖ్యమైనదే అయినప్పటికీ.. దేశ పౌరులను రక్షించుకోవడం తమ బాధ్యత అని కెనడా రక్షణ మంత్రి బిల్​ బ్లెయిర్​ అన్నారు. నిజ్జర్‌ హత్య కేసులో దర్యాప్తు కొనసాగిస్తామని ఆయన తెలిపారు.

india canada dispute
india canada dispute

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2023, 11:57 AM IST

Updated : Sep 25, 2023, 12:09 PM IST

India Canada Dispute : ఖలిస్థానీ అంశంతో భారత్‌, కెనడా మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ వివాదంపై కెనడా రక్షణ మంత్రి బిల్‌ బ్లెయిర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్​తో బంధం తమకు ముఖ్యమైనదేనని అని అన్నారు. అంతే కాకుండా నిజ్జర్‌ హత్య కేసులో తదుపరి దర్యాప్తు తప్పకుండా కొనసాగుతుందని తెలిపారు.

"నిజ్జర్‌ హత్య కేసులో భారత్‌పై ఉన్న ఆరోపణలపై దర్యాప్తు కొనసాగిస్తాం. అదే సమయంలో దిల్లీతో మా భాగస్వామ్య బంధం కూడా కొనసాగుతుంది. భారత్‌తో బంధం మాకు 'ముఖ్యమే'. అయితే, ఈ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఇది సవాల్‌తో కూడుకున్న సమస్యగా మారుతుందని మాకు తెలుసు. కానీ, మా చట్టాలను గౌరవించడం, మా పౌరులను రక్షించుకోవడం మా బాధ్యత. అందుకోసం.. ఈ కేసులో క్షుణ్ణంగా దర్యాప్తు జరిపి అసలు నిజాన్ని వెలికితీయాల్సిన బాధ్యత కూడా మాపై ఉంది. ఈ ఆరోపణలు నిజమైతే.. అది చాలా ఆందోళనకర అంశంగా మారుతుంది. మా గడ్డపై మా పౌరుడిని (నిజ్జర్‌ను ఉద్దేశిస్తూ) హత్య చేయడం మా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే" అని ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కెనడా మంత్రి బ్లెయిర్‌ వ్యాఖ్యానించారు.

ట్రూడోకు జైశంకర్‌ కౌంటర్‌..
Jaishankar Canada Issue :మరోవైపు నిజ్జర్‌ హత్య విషయంలో కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన వ్యాఖ్యలకు భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ మరోసారి స్ట్రాంగ్ కౌంటర్​ ఇచ్చారు. ప్రస్తుతం న్యూయార్క్‌ పర్యటిస్తున్న ఆయన భారత్‌-కెనడా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను గురించి ప్రస్తావించారు. ఈ క్రమంలో కెనడా ప్రధాని ట్రూడోపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. "స్వేచ్ఛ పేరుతో ఎలాగైతే చాలా పనులు జరుగుతున్నాయో.. మార్కెట్‌ పేరుతోనూ చాలా జరుగుతాయి" అంటూ జైశంకర్‌ వ్యాఖ్యానించారు.

ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ చీఫ్‌ హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ హస్తం ఉండొచ్చంటూ తాజాగా ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఈ తీవ్ర దుమారం చెలరేగింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య ఉన్న పరస్పర విమర్శలు, దౌత్యవేత్తల బహిష్కరణలు జరిగాయి. అయితే కెనడా ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. అవన్నీ రాజకీయ ప్రేరేపితమేనని కొట్టిపారేసింది.

Justin Trudeau Statement On India : 'ఆ విషయాన్ని భారత్​కు అప్పుడే చెప్పాం.. మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాం'

India Canada Issue : నిప్పుతో కెనడా చెలగాటం.. ఖలిస్థానీలకు ఎప్పుడూ అండగా..

Last Updated : Sep 25, 2023, 12:09 PM IST

ABOUT THE AUTHOR

...view details