తెలంగాణ

telangana

By

Published : May 1, 2023, 8:19 AM IST

ETV Bharat / international

యూరప్​ దేశాలకు అతిపెద్ద చమురు సరఫరాదారుగా భారత్‌.. రోజుకు 3లక్షల బ్యారెల్‌లు ఎగుమతి!

ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం ప్రపంచ క్రూడాయిల్‌ మార్కెట్‌లో కీలకమార్పులు తీసుకొచ్చింది. తొలిసారి ఐరోపా దేశాలకు భారత్‌ అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఆవిర్భవించింది. అదే సమయంలో రష్యా నుంచి క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకోవడంలోనూ భారత్‌ రికార్డు సృష్టించింది. తాజా పరిస్థితులు ఐరోపాను గడ్డు పరిస్థితుల్లోకి నెడుతున్నట్లు కెప్లర్‌ సంస్థ నివేదించింది.

India becomes Europe largest supplier of refined fuels report by Kpler
India becomes Europe largest supplier of refined fuels report by Kpler

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నేపథ్యంలో అమెరికా, ఐరోపా దేశాలు.. రష్యా ఇంధన ఎగుమతులపై ఆంక్షలు విధించాయి. రష్యా నుంచి ఆయిల్‌ దిగుమతులు తగ్గించాయి. దీంతో ఐరోపాదేశాల ఇంధన అవసరాలను భారత్‌ తీరుస్తోంది. ఈక్రమంలో ఐరోపాదేశాలకు భారత్‌ అతిపెద్ద చమురు సరఫరాదారుగా మారినట్లు కెప్లర్ సంస్థ తెలిపింది. తొలిసారి సౌదీ అరేబియాను పక్కకు నెట్టిన భారత్‌.. ఐరోపాకు రోజుకూ 3లక్షల 60వేల బ్యారెళ్ల చమురు ఎగుమతి చేస్తోంది.

రష్యా నుంచి ఆయిల్‌ దిగుమతులు నిలిచిపోవడం వల్ల ఐరోపా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఓవైపు రష్యా నుంచి నేరుగా దిగుమతి చేసుకుంటే తక్కువ ధరకే చమురు లభించి ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితుల వల్ల ఐరోపా రిఫైనర్లకు పని లేకుండాపోయింది. ఇప్పుడు భారత్‌ వంటి సుదూరదేశాల నుంచి దిగుమతులు చేసుకుంటుండంతో రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. రష్యాను పక్కనబెట్టడంతో ఐరోపా రిఫైన‌ర్లు చమురు ఎక్కడ దొరుకుతుందా అని వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది.

రష్యా నుంచి భారత్‌ రికార్డుస్థాయిలో క్రూడాయిల్‌ను కొనుగోలు చేస్తోంది. ఏప్రిల్‌లో రోజుకు 20లక్షల బారెళ్ల చమురును భారత్‌ తక్కువ రేటుకే దిగుమతి చేసుకుంది. అంటే ఆయిల్‌ దిగుమతుల్లో 44శాతం ఒక్క రష్యా నుంచే వస్తోందన్నమాట. ఈ నేపథ్యంలో భారత్‌కు రష్యా అతిపెద్ద చమురు సరఫరాదారుగా మారింది. రష్యా నుంచి దిగుమతులు తగ్గించుకోవాలని పలు దేశాలు సూచించినప్పటికీ.. భారత్‌ మాత్రం ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకుని భారీగా చమురు కొనుగోలు చేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా నుంచి 3.35 బిలియన్‌ డాలర్ల విలువైన చమురు దిగుమతికాగా.. సౌదీ నుంచి 2.30 బిలియన్‌, ఇరాక్‌ నుంచి 2.03 బిలియన్‌ డాలర్ల విలువైన చమురు దిగుమతి అయినట్లు కెప్లర్‌ నివేదించింది.

భారీగా పెరిగిన చమురు ధరలు..
మే నెల నుంచి ఈ ఏడాది చివరి వరకు ముడిచమురు ఉత్పత్తిలో కోత విధించాలని ఒపెక్ ప్లస్ దేశాలు తీసుకున్న నిర్ణయంతో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. సౌదీ అరేబియాతో పాటు మిగిలిన చమురు ఉత్పత్తి దేశాలు తమ రోజువారీ ఉత్పత్తిలో 11లక్షల 60వేల బ్యారెళ్ల చమురును తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాయి. దీంతో న్యూయార్క్‌ మర్కంటైల్ ఎక్స్ఛేంజీలో US బెంచ్‌మార్క్ క్రూడాయిల్ ధరలు 5.6 శాతం అంటే బ్యారెల్‌కు 4.24 డాలర్లు పెరిగి 79.91 డాలర్లకు చేరాయి. గత అక్టోబరులో ఒపెక్‌ దేశాలు చమురు ఉత్పత్తి తగ్గించగా ఇపుడు మరోసారి అదే నిర్ణయం తీసుకోవడం అమెరికాకు కోపం తెప్పించింది. అంతర్జాతీయ చమురు ధరల ఆధారంగా బ్రెంట్ క్రూడాయిల్ ధర 5.4 శాతం ఎగబాకింది. అంటే బ్యారెల్‌కు 4.35 డాలర్లు పెరిగి 84.24 డాలర్లకు చేరింది.

ABOUT THE AUTHOR

...view details