తెలంగాణ

telangana

ETV Bharat / international

ఈయూ కీలక నిర్ణయం.. రష్యాకు మరో పెద్ద దెబ్బ.. ఇప్పుడిక పుతిన్​ ఏం చేస్తారో? - War crimes Hague

EU Bans Most Russian Oil: ఉక్రెయిన్‌పై దాడిని కొనసాగిస్తున్న రష్యాను నిలువరించే దిశగా ఐరోపా సమాఖ్య కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ ఆర్థిక వనరులను దెబ్బకొట్టడమే లక్ష్యంగా చమురు దిగుమతులపై పాక్షిక నిషేధాజ్ఞలు విధించింది. ఈ ఏడాది చివరినాటికి 90 శాతం దిగుమతులు తగ్గిపోతాయని ఐరోపా సమాఖ్య ప్రకటించింది.

In major blow, EU bans imports of most Russian oil
In major blow, EU bans imports of most Russian oil

By

Published : May 31, 2022, 4:02 PM IST

EU Bans Most Russian Oil: ఉక్రెయిన్‌పై సైనిక చర్య కొనసాగిస్తున్న రష్యా నుంచి చమురు దిగుమతిని పూర్తిగా నిషేధించే అంశంపై కొన్ని వారాలుగా లోతైన చర్చలు జరిపిన ఐరోపా సమాఖ్య.. ఎట్టకేలకు ఓ అవగాహనకు వచ్చింది. ఈ విషయంలో హంగేరీ వ్యక్తం చేసిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని రాజీతో కూడిన ఆంక్షలకు ఒప్పుకుంది. పైప్‌లైన్ మార్గంలో వచ్చే చమురు దిగుమతికి మాత్రం నిషేధం నుంచి మినహాయింపునిచ్చింది. సముద్రమార్గంలో నౌకల ద్వారా వచ్చే చమురుపై మాత్రమే పూర్తిస్థాయి నిషేధం విధించింది. ఫలితంగా.. 67 శాతం దిగుమతులు తక్షణమే ఆగిపోతాయని ఈయూ కౌన్సిల్‌ చీఫ్‌ చార్లెస్‌ మిషెల్‌ వెల్లడించారు. యుద్ధం ఆపేలా రష్యాపై ఒత్తిడి పెంచడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

హంగేరీ ప్రధాని విక్టర్‌ ఆర్బాన్‌ తొలి నుంచి రష్యా దిగుమతులపై నిషేధ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ వచ్చారు. సముద్ర తీరం లేని హంగేరీ చమురు దిగుమతి చేసుకోవాలంటే పైప్‌లైన్‌లు ఒక్కటే మార్గం. మరోవైపు ఆ దేశ చమురు అవసరాల్లో 65 శాతం రష్యా నుంచి వస్తోంది. ఫలితంగా చెక్‌ రిపబ్లిక్‌, స్లొవేకియా నుంచి వస్తున్న డ్రజ్‌బా పైప్‌లైన్‌కు మాత్రం కచ్చితంగా మినహాయింపు ఇవ్వాల్సిందేనని విక్టర్‌ ఆర్బాన్‌ పట్టుబట్టారు. సముద్ర మార్గాన వస్తున్న దిగుమతులపైనే నిషేధం విధించాలని ప్రతిపాదించారు. లేదంటే హంగేరీ ఆర్థిక వ్యవస్థపై అణుబాంబు వేసినట్లే అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హంగేరీతోపాటు మరికొన్ని దేశాలకు కూడా నిషేధం నుంచి ఐరోపా సమాఖ్య మినహాయింపు ఇచ్చింది. ఆయా దేశాలు రెండేళ్లలో ఆంక్షలను అమలు చేయాలని కోరింది. హంగేరీ మాత్రం నాలుగేళ్ల సమయంతోపాటు 800 మిలియన్‌ యూరోల సాయాన్ని కోరింది.

ఐరోపా సమాఖ్య దేశాల చమురు అవసరాల్లో దాదాపు 26 శాతం రష్యా నుంచే దిగుమతి అవుతోంది. ఓవైపు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న ఐరోపా మరోవైపు రష్యా చమురును కొనుగోలు చేస్తూ పరోక్షంగా ఆయుధాలకు నిధులు సమకూరుస్తోందన్న విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరికి రష్యా నుంచి ఐరోపా దేశాలకు వచ్చే చమురు దిగుమతులు 90 శాతం మేర తగ్గిపోతాయని ఈయూ ఎగ్జిక్యూటివ్‌ హెడ్‌ ఉర్సులా వోన్ డెర్‌ లేయెన్‌ తెలిపారు. పోలాండ్‌, జర్మనీ తమ ప్రాదేశిక ప్రాంతాల నుంచి వెళ్తున్న రష్యా పైప్‌లైన్‌ను నిలిపివేస్తామని స్పష్టం చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే రష్యాపై పాశ్చాత్య దేశాలు ఐదు దఫాలుగా ఆంక్షలు విధించగా తాజా ఆంక్షలు రష్యా ఆర్థిక వ్యవస్థపై పెద్ద దెబ్బకొట్టే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

చమురు దిగుమతులపై నిర్ణయంతోపాటు రష్యాపై మరికొన్ని ఆంక్షలను కూడా ఈయూ విధించింది. రష్యాలో అతిపెద్ద బ్యాంక్ అయిన బెర్‌బ్యాంక్‌ను అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ 'స్విఫ్ట్‌' నుంచి నిషేధించింది. రష్యాకు సన్నిహితంగా ఉంటూ యుద్ధనేరాల ఆరోపణలు ఎదుర్కొంటున్న మరింత మందిపైనా ఆంక్షలు విధించారు. రష్యా ప్రభుత్వ అధీనంలో ఉండే మూడు ప్రసార మాధ్యమాలపైనా నిషేధం విధించారు. ఉక్రెయిన్‌పై రష్యా చేసిన దాడిలో జరిగిన యుద్ధనేరాలపై దర్యాప్తు చేసేందుకు కలిసి పనిచేస్తున్న దేశాల బృందం ప్రతినిధులు.. ది హేగ్‌లో సమావేశమై దురాగతాలకు బాధ్యులైన వారిని శిక్షించాలని డిమాండ్​ చేశారు.

ఇవీ చూడండి:నిరంకుశ పాలనలు ప్రపంచాన్ని నడిపించలేవు.. జిన్‌పింగ్‌ను తప్పుపట్టిన బైడెన్‌

ఉక్రెయిన్​ యుద్ధం వల్ల ఆఫ్రికాలో ఆకలి కేకలు

ABOUT THE AUTHOR

...view details