Imran Khan No Confidence: పాకిస్థాన్‌లో వరుసగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని ప్రభుత్వం ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై నెగ్గేందుకు ఉన్న దారులన్నీ మూసుకుపోయాయి. సొంతపార్టీకి చెందిన ఎంపీలతోపాటు ప్రధాన మిత్రపక్షం ఎంక్యూఎం-పీ కూడా ప్రతిపక్షాలతో చేతులు కలిపింది. ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానానికి అధికార సంకీర్ణలోని మిత్రపక్షం ఎంక్యూఎం-పీ మద్దతు ప్రకటించడంతోపాటు ఆ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు కూడా ఇమ్రాన్ కేబినెట్ నుంచి తప్పుకున్నారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం మైనార్టీలో పడింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇమ్రాన్ రాజీనామా చేయటం తప్ప మరోమార్గం లేని పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం అక్కడి ప్రజలను ఉద్దేశించి తొలుత ప్రసంగించాలని భావించిన ఇమ్రాన్ ఖాన్ తర్వాత నిర్ణయం మార్చుకున్నారు.
ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్.. ప్రధానిగా కొనసాగే నైతిక హక్కు కోల్పోయారని, తక్షణం రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. షెహ్‌బాజ్ షరీఫ్ పాకిస్థాన్ తదుపరి ప్రధాని కానున్నారని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టో ప్రకటించారు. అయితే ప్రతిపక్షాల డిమాండ్‌ను అధికార పక్షం తోసిపుచ్చింది. ఇమ్రాన్ రాజీనామా చేసే ప్రసక్తే లేదని.. పాక్ ఐటీశాఖ మంత్రి ట్వీట్ చేశారు. చివరి బంతి వరకు పోరాటం చేస్తారన్నారు. ఓటింగ్ రోజు తమ శత్రువులెవరో, మిత్రులెవరో తేలుతుందన్నారు. ఇప్పటికే కేబినెట్ మంత్రులతో పాక్ ప్రధాని.. అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఐఎస్ఐ చీఫ్, పాక్ సైనిక దళాల ప్రధానాధికారి ఇమ్రాన్‌తో రెండు దఫాలుగా సమావేశం కావటం ఉత్కంఠ రేపుతోంది.