Imran Khan Arrest : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తరఫు న్యాయవాదులు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఇమ్రాన్‌తో ఓ గంటపాటు న్యాయవాదులు భేటీ అయ్యారు. తనను జైల్లో నిద్ర పోనివ్వలేదని టాయిలెట్, బెడ్‌లేని ఒక గదిలో ఉంచారని ఇమ్రాన్ ఈ సందర్భంగా తమకు తెలిపినట్లు ఆయన తరఫు న్యాయవాదులు చెప్పారు. వాష్‌రూమ్ వాడుకోవడానికి కూడా అనుమతించడం లేదని చిత్రహింసలు పెట్టి నెమ్మదిగా గుండెపోటును ప్రేరేపించే ఆహారం, ఇంజెక్షన్లు ఇచ్చారని ఇమ్రాన్ వాపోయారని న్యాయవాదులు అన్నారు. అరెస్టు అనంతరం ఇస్లామాబాద్‌లోని పోలీస్ లైన్స్‌కు తీసుకువెళ్లిన తర్వాత ఆహారం కూడా ఇవ్వలేదని ఇమ్రాన్ న్యాయవాదులు ఆరోపించారు.
ఇస్లామాబాద్ హైకోర్టుకు ఇమ్రాన్
ముందస్తు బెయిల్ కోసం ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం ఇస్లామాబాద్ హైకోర్టు ఎదుట హాజరయ్యారు. భారీ భద్రత మధ్య ఇమ్రాన్ ఖాన్‌ను పోలీసులు కోర్టుకు తీసుకెళ్లారు. ఇమ్రాన్ మద్ధతుదారులు పెద్ద ఎత్తున కోర్టు వద్దకు చేరుకోవడం వల్ల అదనపు బలగాలను మోహరించారు. జస్టిస్ మియాంగుల్ హసన్ ఔరంగజేబ్, జస్టిస్ సమన్ రఫత్ ఇంతియాజ్‌లతో కూడిన ప్రత్యేక డివిజన్ బెంచ్.. ఇమ్రాన్ బెయిల్ పిటిషన్‌ను స్వీకరించింది. అయితే బెయిల్ పిటిషనపై విచారణను ప్రారంభించిన స్పెషల్ బెంచ్.. శుక్రవారం కొద్దిసేపు వాయిదా వేసింది. ప్రతి శుక్రవారం చేసే ప్రత్యేక ప్రార్థనల అనంతరం విచారణను తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించింది.