తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇమ్రాన్‌ ఖాన్‌కు భారీ ఊరట.. ఏడు స్థానాల్లో పోటీ.. ఆరుచోట్ల గెలుపు - ఇమ్రాన్​ ఖాన్​ ఉప ఎన్నికలు

పాకిస్థాన్​లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ ఒక్కరే ఏడు స్థానాల నుంచి పోటీ చేయగా.. అందులో ఆరు స్థానాల్లో విజయం సాధించారు. ఈస్థాయిలో విజయం సాధించడం మామూలు విషయం కాదని అక్కడి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Pakistan imran khan
ఇమ్రాన్​ ఖాన్​

By

Published : Oct 17, 2022, 8:13 PM IST

అవిశ్వాస తీర్మానంతో ఓటమిచెంది పదవి కోల్పోయిన పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు భారీ ఊరట లభించింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో పీటీఐ పార్టీ భారీ విజయం సాధించింది. జాతీయ అసెంబ్లీతోపాటు స్థానిక ప్రావిన్సులకు సంబంధించి మొత్తం 11 నియోజకవర్గాల్లో ఉపఎన్నిక జరగగా.. ఎనిమిదింటిని పీటీఐ కైవసం చేసుకుంది. ఇమ్రాన్‌ ఖాన్‌ ఒక్కరే ఏడు స్థానాల నుంచి పోటీ చేయగా.. అందులో ఆరు స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటుకున్నారు. తాజా ఉప ఎన్నికలను రిఫరెండంగా పేర్కొన్న ఇమ్రాన్‌.. అధికారపక్షంపై ఈస్థాయిలో విజయం సాధించడం మామూలు విషయం కాదని అక్కడి రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన అవిశ్వాస తీర్మానంతో ఓటమి తర్వాత.. నేషనల్‌ అసెంబ్లీ సభ్యులు రాజీనామా చేయాలని పీటీఐ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ తమ పార్టీకి చెందిన సభ్యులకు సూచించారు. అందుకు అనుగుణంగా పీటీఐ నేతలు రాజీనామా చేశారు. అందులో ఎనిమిది స్థానాలకు ఎన్నికల సంఘం ఉప ఎన్నికలను ఇటీవల నిర్వహించింది. వీటితో పాటు పంజాబ్‌ ప్రావిన్సులోని మూడు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిపింది.

ఇందులో భాగంగా నేషనల్‌ అసెంబ్లీలో (పార్లమెంట్‌ దిగువసభ) ఎనిమిది స్థానాలకు గాను.. ఏడు చోట్ల నుంచి పీటీఐ తరఫున ఇమ్రాన్‌ ఖాన్‌ ఒక్కరే పోటీకి దిగారు. తాజా ఫలితాల్లో ఆరు స్థానాల్లో విజయం సాధించగా ఒక్క కరాచీ స్థానంలో మాత్రమే ఓడిపోయారు. మరో నియోజకవర్గం ముల్తాన్‌ నుంచి పోటీ చేసిన పీటీఐ అభ్యర్థి ఓటమి చెందారు. ఇలా ఆరు నేషనల్‌ అసెంబ్లీ స్థానాలతో పాటు మరో రెండు అసెంబ్లీ ప్రావిన్సుల్లోనూ పీటీఐ విజయం సాధించింది. అధికార కూటమి మాత్రం కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. అంతకుముందు (ఈ ఏడాది జులైలో) పంజాబ్‌ అసెంబ్లీకి 20స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ పీటీఐ పార్టీ 15 స్థానాలను కైవసం చేసుకుంది. చట్టసభ సభ్యులు తీసుకున్న నిర్ణయం తప్పని.. వారి తప్పిదాన్ని గుర్తించేందుకు తాజా ఫలితాలు మరో అవకాశాన్ని కల్పిస్తున్నాయని పీటీఐ సెక్రటరీ జనరల్‌ అసద్‌ ఉమర్‌ పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికలు జరగాలని ప్రజలు నిర్ణయించినట్లు ఈ ఫలితాలను బట్టి తెలుస్తోందని మాజీ మంత్రి ఫవాద్‌ చౌద్రీ అన్నారు.

ఇదిలాఉంటే, పాకిస్థాన్‌ ఎన్నికల్లో ఒక వ్యక్తి ఎన్ని చోట్ల నుంచైనా పోటీ చేయవచ్చు. అయితే, ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో గెలిస్తే మాత్రం ఏ స్థానాలను వదులుకుంటారో ఎన్నికల సంఘానికి తెలియజేయాలి. ఇలా ఇమ్రాన్‌ ఖాన్‌ మాదిరిగా ఒకేసారి అనేక స్థానాల్లో పోటీ చేయడం మాత్రం అరుదని అక్కడి రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు ఆరు చోట్ల గెలిచినప్పటికీ ఇమ్రాన్‌ ఖాన్‌ మాత్రం ఎక్కడా ప్రాతినిధ్యం వహించరని పీటీఐ పార్టీ పేర్కొంది. అయితే, షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏడాది అక్టోబర్‌లో పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ, అంతకుముందే ఎన్నికలను నిర్వహించాలని ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ (పీటీఐ) పట్టుబడుతోంది.

ABOUT THE AUTHOR

...view details