ప్రజానిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో చైనా ప్రభుత్వం స్థానికంగా జీరో కొవిడ్ ఆంక్షలను ఇటీవలె సడలించింది. దీంతో దేశంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నాటికి చైనాలో కరోనా కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లోని 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్' అంచనా వేసింది. అప్పటికి మరణాల సంఖ్య 3.22 లక్షలకు చేరుకుంటుందని తెలిపింది. ఆంక్షల తొలగింపుతో 2023 నాటికి దాదాపు పది లక్షలకుపైగా పైగా మరణాలు సంభవించవచ్చని ఐహెచ్‌ఎంఈ పేర్కొంది.
చైనాలో పెరుగుతున్న కరోనా.. ఏప్రిల్ 1 నాటికి గరిష్ఠ స్థాయిలో కేసులు..! - చైనా కొవిడ్ 19 యాక్టివ్ కేసుల సంఖ్య
వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నాటికి చైనాలో కరోనా కేసుల సంఖ్య గరిష్ఠానికి చేరుకునే అవకాశం ఉంది. ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లోని 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్' ఒక అంచనా విడుదల చేసింది.
ఏప్రిల్ 1 నాటికి చైనా జనాభాలో మూడింట ఒకవంతు ప్రజలకు మహమ్మారి సోకుతుందని ఐహెచ్‌ఎంఈ డైరెక్టర్ క్రిస్ట్‌ఫర్ ముర్రే వెల్లడించారు.'చైనా తన జీరో కొవిడ్ విధానానికే కట్టుబడి ఉంటుందని భావించలేదు. ఎందుకంటే.. తొలుత బయటపడిన వేరియంట్లను కట్టడి చేసేందుకు ఆ విధానం ప్రభావవంతంగా పని చేసి ఉండొచ్చు. కానీ, ఒమిక్రాన్ వేరియంట్‌ల అధిక వ్యాప్తి కారణంగా దాన్ని కొనసాగించడం అసాధ్యం' అని ముర్రే అన్నారు. ఇదిలా ఉండగా.. ఆంక్షలు ఎత్తివేసినప్పటి నుంచి చైనా అధికారికంగా కరోనా మరణాలను వెల్లడించలేదు. డిసెంబర్ 3న చివరిసారి విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఈ సంఖ్య 5,235కి చేరుకుంది. ప్రస్తుతం చైనా జనాభా 1.41 బిలియన్లుగా ఉంది.
మరోవైపు.. కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్‌లో గ్లోబల్ హెల్త్ సీనియర్ ప్రతినిధి యాన్‌జోంగ్ హువాంగ్ మాట్లాడుతూ.. 'చైనాలో 16.4 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. దీంతో కొవిడ్ పర్యవసనాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. 80 ఏళ్లు, ఆపైబడినవారూ 8 మిలియన్ల మంది ప్రజలు ఉన్నారు. వారికి టీకాలు వేయలేదు. ప్రభుత్వం.. స్థానికంగా తయారు చేసిన వ్యాక్సిన్‌లకే ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికీ విదేశీ వ్యాక్సిన్‌లను ఉపయోగించడానికి ఆసక్తి చూపడం లేదు' అని తెలిపారు. టీకాల ప్రక్రియ ముమ్మరం చేయడంతో పాటు వెంటిలేటర్లు, అవసరమైన మందుల నిల్వలతో కరోనా పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధమైనట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది.