IAEA Iran News: అణ్వాయుధ తయారీకి ఉపకరించే యురేనియంను ఉత్పత్తి చేసే దశకు చేరుకుంటున్న ఇరాన్ తన కార్యకలాపాలు అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) కంటపడకుండా జాగ్రత్త పడుతోందని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ రఫయేల్ మేరియానో గ్రాసి వెల్లడించారు. ఇరాన్‌లోని అణు కేంద్రాల్లో 27 నిఘా కెమెరాలను తొలగిస్తోందని తెలిపారు. అయితే ఆ దేశంలో ఇంకా 40 పైచిలుకు కెమెరాలు ఉన్నాయి. తొలగించబోతున్న కెమెరాలు యురేనియంను శుద్ధి చేసే నటాంజ్ భూగర్భ అణు కేంద్రంలోనూ, ఇస్ఫహాన్‌లోనూ ఉన్నాయి. తాను నిఘా కెమెరాలను తొలగించదలచినట్లు ఇరాన్ ఇంతవరకు నిర్ధారించలేదు. అణ్వస్త్ర తయారీకి శుద్ధి చేసిన యురేనియం అవసరం. నటాంజ్‌లో రెండు కెమెరాలను మూసివేసినట్లు బుధవారంనాడే ఇరాన్ తెలిపిందని ఐఏఈఏ ఒప్పుకుంది. తనను అభిశంసించడానికి వియన్నాలో ఐఏఈఏ డెరెక్టర్ల బోర్డు సమావేశమవుతున్న సమయంలోనే ఇరాన్ నిఘా కెమెరాలను తొలగిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇది ఐఏఈఏపై ఒత్తిడి పెంచే చర్యలా కనిపిస్తోంది. మొదటి తరం సెంట్రిఫ్యూజ్ కన్నా 10 రెట్లు ఎక్కువ వేగంతో యురేనియంను శుద్ధి చేసే ఐఆర్-6 సెంట్రిఫ్యూజ్‌లను నటాంజ్‌లో నెలకొల్పదలచినట్లు ఇరాన్ గతంలోనే తెలిపింది. అణ్వస్త్ర తయారీకి 90 శాతం శుద్ధి చేసిన యురేనియం కావాలి. ఇరాన్ ఇంతవరకు 60 శాతం శుద్ధి సామర్థ్యాన్ని సంతరించుకుంది.
ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలంటే యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని బాగా తగ్గించుకోవాలని అమెరికాతో పాటు భద్రతామండలి సభ్య దేశాలు, ఐరోపా సమాఖ్య (ఈయూ)లు డిమాండ్ చేశాయి. ఈ మేరకు 2015లో ప్రాథమిక ఒప్పందం కుదిరినా, 2018లో డోనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా ఆ ఒప్పందం నుంచి వైదొలిగారు. ఒప్పంద పునరుద్ధరణ చర్చలు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి స్తంభించిపోయాయి. మరోవైపు ఇరాన్ అణ్వాయుధానికి కావలసిన యురేనియంను సిద్ధం చేసుకొంటోందని వార్తలు వచ్చాయి. ఈ విషయంలో ఇరాన్‌ను అభిశంసించడానికి వియన్నాలో ఐఏఈఏ డైరెక్టర్ల బోర్డు సమావేశమవుతున్న సమయంలోనే నిఘా కెమెరాల తొలగింపు జరిగింది. ఈ సమావేశంలో ఇరాన్‌పై అభిశంసన తీర్మానాన్ని ఈయూ (జర్మనీ), ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్ లు ప్రతిపాదించగా రష్యా, చైనాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. ఐఏఈఏలో ఇతర సభ్యదేశాలైన భారత్, పాకిస్థాన్, లిబియాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. మరోవైపు ఇరాన్ అణుబాంబు తయారు చేయకుండా నిరోధించడానికి ముందస్తు దాడి జరుపుతామని ఇజ్రాయెల్ గతంలోనే హెచ్చరించి ఉంది. ఇటీవల ఇరాన్ అణు శాస్త్రజ్ఞులు, అధికారులను హతమార్చడం వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని అనుమానిస్తున్నారు.