HUSBAND ON RENT: యూకేకు చెందిన లారా యంగ్ అనే ఓ మహిళ వినూత్నంగా ఆలోచించింది. డబ్బులు సంపాదించేందుకు తన భర్తను అద్దెకిస్తోంది. ఇందుకోసం 'రెంట్ మై హ్యాండీ హస్బెండ్' పేరుతో ఓ వెబ్సైట్ ఓపెన్ చేసింది. చిన్నచిన్న పనులు చేసిపెట్టేందుకు తన భర్తను అద్దెకు ఇస్తున్నట్లు మహిళ తెలిపింది. ఇళ్లలో ఫర్నీచర్‌ను సెటప్ చేసిపెడుతూ జీవనం సాగదీస్తున్న ఓ వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని ఈ ఆలోచన చేసినట్లు లారా చెబుతోంది.
ఆ పనుల్లో నేర్పరి..
UK Woman rents her husband:లారా భర్త జేమ్స్.. ఇంటి పనుల్లో దిట్ట. చిన్నచిన్న పనులను అలవోకగా పూర్తి చేస్తాడు. పెయింటింగ్, డెకరేషన్, టైల్స్, కార్పెట్లు ఏర్పాటు చేయడం వంటి పనులను నేర్పుతో చేస్తాడు. బకింగ్‌హమ్‌షైర్‌లోని తన ఇంట్లో పనికిరాని వస్తువులను ఉపయోగించి డైనింగ్ టేబుల్ తయారు చేశాడు. సొంతంగా బెడ్లను రూపొందిస్తున్నాడు. అందుకే అతడి నైపుణ్యాలను ఉపయోగించుకుంటున్నట్లు లారా చెబుతున్నారు.
"ఇంటి పనులు, గార్డెన్ పనులను మెరుగ్గా చేస్తారు. అప్పుడే నాకు ఆలోచన వచ్చింది. ఈయన స్కిల్స్‌ను ఉపయోగించుకొని అద్దెకు ఇవ్వొచ్చు కదా అని! చాలా మందికి ఇది నచ్చింది. కొన్నిసార్లు చిన్నచిన్న పనులు చేసిపెట్టేందుకు ఎవరూ ముందుకురారు. ఫర్నిచర్ విడిభాగాలను కలిపి పెట్టడం, ట్రాంపోలిన్ ఏర్పాటు చేయడం, షెల్ఫ్‌లలో సామాను అమర్చడం వంటి పనులకు జేమ్స్ సరిగ్గా సెట్ అవుతారు. భర్తలు ఆ పనులు చేసిపెడతారని మనం చాలా రోజుల నుంచి ఎదురుచూసి విసిగిపోతాం. అలాంటి పనులను చేసిపెట్టేందుకు ఒకరు దొరికితే మంచిదే కదా."
-లారా యంగ్