Humanitarian Truce Israel Gaza : ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం నేపథ్యంలో మానవతా సంధికి పిలుపునిచ్చే నాన్ బైండింగ్ తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. అక్టోబరు 7 హమాస్ దాడుల తర్వాత UN నుంచి ఇదే తొలి చర్య. 193 మంది సభ్యులతో కూడిన ఐరాస జనరల్ అసెంబ్లీ.. 120-14 ఓట్లతో ఈ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ ఓటింగ్‌కు భారత్ సహా 45 దేశాలు దూరంగా ఉన్నాయి.
పౌరుల రక్షణ, చట్టబద్ధమైన, మానవతా బాధ్యతలను సమర్థించడంపై UN జనరల్ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. శక్తిమంతమైన ఐరాస భద్రతామండలిలో తీర్మానాలను అగ్ర దేశాలు వీటో చేస్తున్న వేళ.. చివరకు జోర్డాన్ దీన్ని జనరల్ అసెంబ్లీలోనే ప్రవేశపెట్టింది. ఐరాస జనరల్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాలు, భద్రతామండలి లాగా.. చట్టబద్ధంగా కచ్చితంగా కట్టుబడి ఉండే అవకాశం ఉండదు. కానీ ప్రపంచ దేశాల అభిప్రాయాలకు ఇది కొలమానంగా మాత్రమే పనిచేస్తాయి.
అంతకుముందు.. ఐరాస జనరల్ అసెంబ్లీ వేదికగా ఇజ్రాయెల్, పాలస్తీనా రాయబారులు బలంగా తమ వాదన వినిపించారు. తమ దేశ పౌరులపై జరుగుతున్న దాడులను ప్రపంచం ఎదుట ఉంచేందుకు యత్నించారు. గాజాలో తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని, బందీలను విడుదల చేయాలని జోర్డాన్ ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా ఇజ్రాయెల్ స్పందించింది.
"హమాస్ అక్టోబర్ 7వ తేదీన తమ దేశ పౌరులపై చేసిన మారణకాండను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఐరాసలోని సభ్యదేశాల ప్రతినిధులకు క్యూఆర్ కోడ్‌తో ఉన్న ఒక షీట్‌ను ఇజ్రాయెల్ ఇచ్చింది. దీనిని స్కాన్ చేయగా.. హమాస్ అక్టోబర్ 7వ తేదీన చేసిన పాశవిక దాడి దృశ్యాలు వచ్చాయి. అదే సమయంలో ఎర్డాన్ ఐరాస వేదికపై మాట్లాడుతూ తన ట్యాబ్‌లో ఒక దృశ్యాన్ని సభకు చూపించారు. దీనిలో ఓ థాయ్‌లాండ్ కార్మికుడిని హమాస్ ఉగ్రవాదులు చంపి.. అతడి శరీరాన్ని ఛిద్రం చేస్తున్న దృశ్యాలున్నాయి. నేను గత కొన్ని వారాల్లో ఇలాంటి చాలా టేపులను చూశాను. అవి నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. తీవ్రంగా గాయపడిన పౌరుడిపై హమాస్ ఉగ్రవాది దాడి చేయడాన్ని మీరు చూడొచ్చు. అతడు థాయిలాండ్ నుంచి వచ్చిన వ్యవసాయ కార్మికుడు. యూదుడు కాదు. ఆ వ్యక్తి మరణంతో పోరాడుతుంటే.. భయంకరంగా ప్రవర్తించారు. హమాస్ ఉగ్రవాదులు కంటికి కనిపించిన ప్రతి ప్రాణిని చంపారు. ఇది పాలస్తీనా వాసులపై యుద్ధం కాదు. హమాస్ ఉగ్రవాదులపై పోరాటం" అంటూ ఇజ్రాయెల్ రాయబారి గిలద్ ఎర్డాన్ సభకు వెల్లడించారు.
అంతకు ముందు పాలస్తీనా ప్రతినిధి రియాద్ మన్సూర్ మాట్లాడారు. గాజా ముట్టడిలో పాలస్తీనా వాసులను ఇజ్రాయెల్ చంపుతోందని ఆరోపించారు. ఆసుపత్రులు పనిచేయడంలేదని పేర్కొన్నారు. "కన్నీరు పెట్టుకోవడానికి సమయం లేదు. పాలస్తీనా వాసుల హత్యలకు.. ఇజ్రాయెల్ వాసుల హత్యలు సమాధానం కాదు. ఇజ్రాయెల్ వాసుల హత్యలకు పాలస్తీనా వాసులను చంపడం జవాబు కాదు. కానీ, కొందరు ఇజ్రాయెల్ వాసుల కోసం ఎక్కువ బాధపడతారు.. మాకోసం (పాలస్తీనా) తక్కువ బాధపడతారు. గాజాలో పలు యద్ధాలను తట్టుకొని జీవించిన వారిని ఇప్పుడు చంపుతున్నారు" అని మన్సూర్ తమ వారి ఆవేదనను సభకు వినిపించారు.
Israel Iron Sting : ఇజ్రాయెల్ 'ఐరన్ స్టింగ్'.. ఒకే రౌండ్‌తో లక్ష్యాలన్నీ ధ్వంసం!
Gaza Healthcare Collapse : గాజాలో ఆరోగ్య సంక్షోభం.. రోగాలతో అనేక మంది మృతి! ఒక్కపూటే తిండి