Houthis Red Sea America : ఎర్రసముద్రంలో రవాణా నౌకలపై నవంబరు నుంచి వరుస దాడులకు తెగబడుతున్న హౌతీ తిరుగుబాటుదారులకు ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా హెలికాప్టర్ల దాడితో 10 మంది హౌతీలు మృతి చెందారు. డెన్మార్క్ షిప్పింగ్ సంస్థ మెర్చ్ హంగ్జౌ రవాణా నౌకను ఆదివారం హౌతీ తిరుగుబాటుదారులు హైజాక్ చేసేందుకు ప్రయత్నించారు. ఇందుకోసం నాలుగు బోట్లలో నౌక సమీపానికి చేరుకున్నారు.
మూడు బోట్లు ధ్వంసం- నాలుగోది జంప్!
ఈ సమయంలో మెర్స్ సిబ్బంది పంపిన సందేశాలతో రంగంలోకి దిగిన అగ్రరాజ్యానికి చెందిన హెలికాప్టర్లు కాల్పులు జరిపాయి. మూడు బోట్లు ధ్వంసం అవ్వగా నాలుగో బోటు తప్పించుకొని వెళ్లిపోయింది. కాల్పుల్లో 10 మంది మరణించినట్లు హౌతీలు ప్రకటించారు. ఈ ఘటన తర్వాత 48 గంటల పాటు తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు మెర్స్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.
క్షిపణులను తిప్పికొట్టాం : అమెరికా
ఈ విషయంపై అమెరికా స్పందించింది. శనివారం కూడా మెర్స్ రవాణా నౌకపై హౌతీలు క్షిపణులను ప్రయోగించారని వాటిని తాము తిప్పికొట్టినట్లు తెలిపింది. ఆదివారం మరోసారి చిన్న బోట్లతో దాడికి ప్రయత్నించారని పేర్కొంది. మరోవైపు, అమెరికా దాడిపై హౌతీ తీవ్రంగా స్పందించింది. ఎర్ర సముద్రంలో అమెరికా సహా ఏ దేశం జోక్యం చేసుకున్నా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.