తెలంగాణ

telangana

ETV Bharat / international

పుత్రుడి లీల.. రహస్య పత్రాల గోల.. బైడెన్​కు కొత్త చిక్కులు! - హంటర్​ బైడెన్​ కాంట్రవర్సీ

అమెరికా అధ్యక్షుడు జో బైజెన్ నిజాయతీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ​ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన సేకరించిన పత్రాలు వెలుగులోకి వచ్చాయి. తండ్రి అధికారాన్ని ఆసరాగా చేసుకుని హంటర్​ బైడెన్​ ఆధిపత్యం చలాయించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీని కారణంగా బైడెన్ల చూట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది.

hunter-biden-probe
hunter-biden-probe

By

Published : Jan 13, 2023, 6:52 AM IST

రెండేళ్లుగా ప్రజాస్వామ్య రక్షకుడిగా, అవినీతిరహితుడిగా అమెరికా అధికార పీఠంపై ఏకఛత్రాధిపత్యం చలాయిస్తున్న అధ్యక్షుడు జో బైడెన్‌ నిజాయతీపై తొలిసారి సందేహాలు మొదలయ్యాయి. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇంటికి ఎఫ్‌బీఐని పంపించి.. ఆయన పదవి నుంచి దిగిపోతూ ఇవ్వకుండా తీసుకువెళ్లిన రహస్య పత్రాలను బైడెన్‌ యంత్రాంగం గతంలో బయటపెట్టింది. ట్రంప్‌పై క్రిమినల్‌ విచారణను కూడా మొదలెట్టింది. తద్వారా 2024లో మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకుంటున్న ట్రంప్‌ను బైడెన్‌ రాజకీయంగా దెబ్బతీయాలని చూశారు.

కొద్దిరోజుల కిందట బైడెన్‌ పాత కార్యాలయంలో తన సహచరులు చేసిన 'తవ్వకాలు' ఆయన్ను అనూహ్యంగా ఇబ్బందుల్లో పడేశాయి. సహచరుల వెతుకులాటలో గతంలో బైడెన్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు సేకరించిన అధికారిక రహస్య పత్రాలు బయటపడ్డాయి. తాజాగా మరోచోట కూడా మరికొన్ని రహస్య పత్రాలు దొరికినట్లుగా చెబుతున్నారు. తొలి విడత పత్రాలు నవంబరులో బయటపడగా... ఇప్పటిదాకా ఆ విషయాన్ని దాచి పెట్టడం గమనార్హం. ఇవన్నీ ఉక్రెయిన్‌, ఇరాన్‌, బ్రిటన్‌లకు సంబంధించిన రహస్య పత్రాలు! ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉక్రెయిన్‌పై అమెరికా విధాన నిర్ణయాల బాధ్యతను ఉపాధ్యక్షుడిగా బైడెన్‌ చూసేవారు.

నాటి రహస్య పత్రాలు తన కార్యాలయంలోకి ఎలా వచ్చాయో తెలియదని.. విచారణలో న్యాయశాఖకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని చెబుతూ బైడెన్‌ కార్యాలయం తప్పించుకోజూసినా ఇది అక్కడితో ఆగేలా లేదు. కారణం- ఉక్రెయిన్‌తో ఆయన కుమారుడు హంటర్‌ బైడెన్‌కున్న లంకె! తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని ఉక్రెయిన్‌, చైనా కంపెనీల వ్యాపారలావాదేవీల ద్వారా అవినీతి పద్ధతుల్లో సంపాదించారన్నది ఆయనపై ఉన్న విమర్శ. వాటిపై విచారణ జరుగుతోంది కూడా. హంటర్‌ అవినీతి సంపాదన జో బైడెన్‌కు తెలిసే జరిగిందన్నది రిపబ్లికన్ల ఆరోపణ. అందుకే తాజాగా ప్రతినిధుల సభలో మెజార్టీ సంపాదించిన రిపబ్లికన్లు బైడెన్‌ బ్యాంకు లావాదేవీల వివరాలను ఇవ్వాల్సిందిగా ఆర్థిక శాఖను డిమాండ్‌ చేశారు.

వెలుగులోకి మరిన్ని రహస్య పత్రాలు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ రోజురోజుకూ మరింతగా సమస్యల ఊబిలో కూరుకుపోతున్నారు. ఆయన నివాసంలో మరిన్ని అధికారిక రహస్య పత్రాలు బయటపడ్డాయి. ఈ విషయాన్ని శ్వేతసౌధం గురువారం వెల్లడించింది. ఆ పత్రాలన్నీ 2009-16 మధ్య బైడెన్‌ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటినాటివే. వాషింగ్టన్‌లోని బైడెన్‌ ప్రైవేటు నివాసమైన పెన్‌ బైడెన్‌ సెంటర్‌లో గతేడాది నవంబరులో రహస్య పత్రాలు బయటపడిన సంగతి ఇటీవల వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టించింది.

ఆ పత్రాలు దొరికిన తర్వాత న్యాయ శాఖతో సమన్వయం చేసుకుంటూ దేశాధ్యక్షుడి న్యాయవాదులు డెలావర్‌లో విల్మింగ్టన్‌, రహబత్‌ బీచ్‌ల్లోని బైడెన్‌ నివాసాల్లో సోదాలు నిర్వహించారు. అక్కడ గుర్తించిన పత్రాలను బుధవారం వరకు క్షుణ్నంగా పరిశీలించారు. వాటిలో బైడెన్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటికి సంబంధించిన అధికారిక రహస్య పత్రాలు కూడా కొద్ది సంఖ్యలో ఉన్నట్లు తేల్చారు. మొత్తం పత్రాల్లో ఒక్కటి తప్ప మిగిలినవన్నీ విల్మింగ్టన్‌ నివాసంలోని స్టోరేజీ ప్రదేశంలో దొరికాయి.

సమస్యాత్మక పుత్రరత్నం!
బైడెన్‌ కుమారుడు హంటర్‌ బైడెన్‌ది ఓ సమస్యాత్మక నేపథ్యం! ప్రతిష్ఠాత్మక యేల్‌ విశ్వవిద్యాలయం నుంచి పట్టా పొందిన హంటర్‌ దేశీయంగా లాబీయింగ్‌ (పనులు చక్కదిద్దటం)లో ఉండేవారు. తండ్రి ఉపాధ్యక్షుడయ్యాక అది వదిలేసి అంతర్జాతీయ వ్యాపార బంధాలపై దృష్టిసారించారు. ఉక్రెయిన్‌కు చెందిన ఇంధన కంపెనీ బురిస్మా బోర్డులో చేరారు. ఏడాదికి 6 లక్షల డాలర్లు బురిస్మా నుంచి ఆయనకు అందాయి. అవినీతి ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న ఆ కంపెనీ యజమాని జ్లొచెవిస్కీతో ఆయన చెట్టపట్టాలు ప్రశ్నార్థకమయ్యాయి. 2016, 2017ల్లో పన్ను వ్యవహారాలకు సంబంధించి, నిబంధనలకు విరుద్ధంగా తుపాకీ కొనుగోలు చేయటంలాంటి ఆరోపణలతో ఆయనపై విచారణ ఇప్పటికీ కొనసాగుతోంది.

  • అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు తదితర ఉన్నతస్థాయిలోని కొద్ది మందికి మాత్రమే రహస్య పత్రాలు అందుబాటులో ఉంటాయి. తమ పదవీకాలం పూర్తికాగానే వాటిని అమెరికా జాతీయ ఆర్కైవ్స్‌కు అప్పగించి వెళ్లాలనేది నిబంధన.

ABOUT THE AUTHOR

...view details