Honduras Jail Fire : సెంట్రల్ అమెరికాలోని హోండురస్‌లో దారుణం జరిగింది. దేశ రాజధాని తెగుసిగల్పాకు వాయవ్యంగా 30 మైళ్ల దూరంలో ఉన్న తమారా మహిళాజైలులో మంగళవారం ఖైదీల మధ్య జరిగిన గొడవల్లో 41 మంది ఖైదీలు మరణించారు. వీరిలో కొందరు సజీవ దహనం కాగా.. మరికొందరు తుపాకీ బుల్లెట్ గాయాలతో మరణించారు. మరో ఏడుగురు మహిళా ఖైదీలు తుపాకీ కాల్పులు, కత్తి గాయాలతో తెగుసిగల్పా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
జైలులో రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవే ఈ మరణాలకు కారణమని తెలుస్తోంది. జైళ్లలో అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి అధికారులు ఇటీవల చేసిన ప్రయత్నాల కారణంగానే అల్లర్లు జరిగాయని హోండురస్ జైళ్ల శాఖ అధికారి జూలిస్సా విల్లాన్యువా తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
జైలులో మహిళా ఖైదీల మరణించడంపై హోండురస్ అధ్యక్షురాలు జియోమర క్యాస్ట్రో స్పందించారు. మహిళా ఖైదీల మరణాలు.. తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయని ఆమె తెలిపారు. నిందుతులపై కఠిన చర్యలు తీసుకుంటామని క్యాస్ట్రో పేర్కొన్నారు.
ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో 18 మంది..
కొన్నాళ్ల క్రితం మధ్య అమెరికాలోని హోండురస్ జైలులో ఖైదీల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణలో 18 మంది చనిపోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. హోండురస్ రాజధాని తెగుసిగల్పాలోని ఎల్ పోర్వనిర్ జైలులో జరిగిన ఈ ఘర్షణలో తుపాకులు, వేట కత్తులు వాడారని పోలీసులు తెలిపారు.