ఖలిస్థానీ మద్దతుదారులు మరోసారి రెచ్చిపోయారు. ఆస్ట్రేలియా బ్రిస్బేన్‌లో ప్రఖ్యాత హిందూ ఆలయంపై దాడి చేశారు. శ్రీలక్ష్మీనారాయణ ఆలయ గోడలను ధ్వంసం చేశారు. భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు రాశారు. 'సిక్కు ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) అనే సంస్థ ఆలయంపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న హిందువులను భయపెట్టడానికి ఈ సంస్థ చాలా ప్రయత్నిస్తోంది. వివిధ మార్గాల్లో హిందూ వ్యతిరేక ప్రచారం చేయడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం.' అని ఆలయ ప్రెసిడెంట్ సతీందర్ శుక్లా తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు.
ఒక్క జనవరిలోనే మూడు హిందూ దేవాలయాలపై దాడులు చేశారు ఖలిస్థానీ మద్దతుదారులు. జనవరి 23న మెల్బోర్న్లోని ఇస్కాన్ ఆలయం గోడలపై వ్యతిరేక నినాదాలు చేశారు. జనవరి 16న ఆస్ట్రేలియాలోని క్యారమ్ డౌన్స్‌లోని శ్రీ శివవిష్ణు ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఆలయ గోడలపై విద్వేషాలు రెచ్చగొట్టే నినాదాలు రాశారు. జనవరి 12న, ఆస్ట్రేలియాలోని మిల్ పార్క్‌లోని స్వామినారాయణ్ఆలయాన్ని ధ్వంసం చేశారు. భారత్, హిందూ వ్యతిరేక నినాదాలు గోడలపై రాశారు.
ఆస్ట్రేలియాలోని తమ కాన్సులేట్ జనరల్ స్థానిక పోలీసులతో మాట్లాడి సమాచారం తీసుకున్నారని విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.