high covid vaccination: కరోనా వైరస్ మహమ్మారి నుంచి సురక్షితంగా ఉంచడంలో వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగా తాజాగా అమెరికాలో జరిపిన అధ్యయనం కూడా ఇదే విధమైన ఫలితాలను ఇచ్చింది. అధిక వ్యాక్సినేషన్ ఉన్న ప్రాంతాల్లో కొవిడ్ మరణాల రేటు 80శాతం తగ్గగా.. పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించిన అధ్యయనం బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైంది.
వ్యాక్సినేషన్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో వైరస్ ప్రభావం ఏవిధంగా ఉందనే విషయాన్ని తెలుసుకునేందుకు అమెరికాలో ఓ అధ్యయనం జరిపారు. 48 రాష్ట్రాల్లో 2558 కౌంటీల నుంచి సమాచారాన్ని సేకరించి విశ్లేషించారు. ఆయా ప్రాంతాల్లో డిసెంబర్ 2020 నుంచి డిసెంబర్ 2021 మధ్యకాలంలో 3 కోట్ల పాజిటివ్ కేసులు వెలుగు చూడగా.. 4 లక్షల మరణాలు సంభవించాయి. ఇదే సమయంలో అక్కడ భారీ స్థాయిలో వ్యాక్సిన్ అందించే ప్రయత్నం చేశారు. అనంతరం వ్యాక్సిన్ పంపిణీ అంతగా లేని ప్రాంతాలతో పోలిస్తే వ్యాక్సినేషన్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో కొవిడ్ మరణాల రేటు గణనీయంగా తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు.
గతేడాది ఆల్ఫా వేరియంట్ విజృంభించిన సమయంలో తక్కువ వ్యాక్సిన్ అందించిన ప్రాంతాల్లో కొవిడ్ మరణాల రేటు 60శాతం తగ్గగా.. అధిక వ్యాక్సిన్ పంపిణీ ఉన్న ప్రాంతాల్లో కొవిడ్ మరణాల రేటు 81శాతం తగ్గినట్లు గుర్తించారు. పాజిటివ్ కేసుల్లోనూ ఇదేవిధమైన ఫలితాలు కనిపించాయన్న నిపుణులు.. డెల్టా వేరియంట్ విజృంభణ సమయంలోనూ మరణాలు భారీగా తగ్గినట్లు యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ ప్రొఫెసర్ క్రిస్టోఫర్ డై పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల్లోనూ భారీస్థాయిలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయగలిగినట్లయితే మరిన్ని కొవిడ్ మరణాలను నివారించగలిగేవారమని ప్రొఫెసర్ క్రిస్టోఫర్ అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే.. 2022 మధ్యకాలం నాటికి ప్రపంచ వ్యాప్తంగా 70శాతం మందికి వ్యాక్సిన్ అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఏప్రిల్ 11 నాటికి 1,100 కోట్ల డోసులను పంపిణీ జరిగింది. భారత్ వంటి దేశాల్లో మాత్రం 96శాతం అర్హులకు వ్యాక్సిన్ అందింది. ఇలా కరోనా వ్యాక్సిన్ పంపిణీలో అభివృద్ధి చెందిన, చెందుతోన్న దేశాలు ముందున్నప్పటికీ వ్యాక్సిన్ అందించడంలో చాలా ప్రాంతాలు వెనుకబడ్డాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో కొవిడ్ మరణాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.
ఇదీ చదవండి:ఏజ్ 100+.. 84 ఏళ్లుగా ఒకే కంపెనీలో జాబ్.. నువ్వు దేవుడివి సామీ!